సిమెంట్, స్టీల్‌తోపాటు ఇతర నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదలను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలను నిలిపివేస్తున్నట్లు నిర్మాణ రంగం యూనియన్లు ప్రకటించాయి. ట్రెడా, క్రెడాయ్, టిబిఎఫ్, టిడిఏ యూనియన్లు కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. స్టీల్, సిమెంట్ ధరలతోపాటు ఇతర నిర్మాణ వ్యయం పెరుగుదలతో కొనుగోలుదారులతోపాటు బిల్డర్లు బెంబేలెత్తుతున్నారు. నిర్మాణ రంగానికి చెందిన 250 రకాల వస్తువుల ధరలతోపాటు కార్మికుల కూలీ కూడా పెరగడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగో వంతు నిర్మాణ వ్యయం పెరగడంతో ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదిలీ చెయ్యక తప్పడం లేదని బిల్డర్లు పేర్కొంటున్నారు.
నిర్మాణం చేపట్టిన తర్వాత ధరలు పెరుగుదల అధికంగా ఉంటె దానిని నిర్మాణదారుడిపై తీవ్రంగా పడుతోందని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ వందశాతం పెరిగిందని, సిమెంట్ ధరలు కూడా భారీగా పెరిగాయని ఆ భారమంతా డెవలపర్‌పై పడుతోందన్నారు. ధరలు పెరుగుదలపై ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని క్రెడాయ్ చైర్మన్ రామచంద్ర రెడ్డి , అధ్యక్షుడు మురళీ కృష్ణారెడ్డి, ట్రెడా అధ్యక్షుడు సునీల్ చంద్ర రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు రామకృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి కోరారు. త్వరలో నిర్మాణ రంగానికి చెందిన అన్ని యూనియన్ల ప్రతినిధులందరం ప్రభుత్వాన్ని కలిసి స్టీల్, సిమెంట్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలు జరిగే చోట పనులు నిలిపివేస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: ధరల పెరుగుదలపై ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని క్రెడాయ్ అధ్యక్షుడు మురళీ కృష్ణారెడ్డి కోరారు. యూనియన్ల ప్రతినిధులతా కలిసి ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు తెలిపారు. ప్రతి ఇండస్ట్రీలో నియంత్రణ వ్యవస్థ ఉంటుందని.. కానీ స్టీల్, సిమెంట్ కంపెనీలకు నియంత్రణ వ్యవస్థలు లేవని ట్రెడా అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి ఆరోపించారు. పెరిగిన ధరలతో నిర్మాణాలపై పడే భారాన్ని పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేమని సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. ధరలు తగ్గకుంటే స్థిరాస్తి రంగం మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. అప్పుడే డెవలపర్, కస్టమర్లపై భారం తగ్గుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలపై ప్రత్యేక దృష్టి సారించాలి. యుద్ధం పేరు చెప్పి ధరలు విపరీతంగా పెంచుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇళ్లు కావాలంటే ప్రభుత్వాలు ధరలు నియంత్రించకుండా సాధ్యం కాదు. మన దేశంలో ఎందుకు రేట్లు పెరుగుతున్నాయో ఆలోచించాలి. ధరల పెరుగుదలతో వినియోగదారుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
- మురళీకృష్ణారెడ్డి, క్రెడాయ్ అధ్యక్షుడు
ఇదీ చూడండి: 'ఒప్పందం మేరకే ఉప్పుడు బియ్యం కొంటాం..' పునరుద్ఘాటించిన కేంద్రమంత్రి..