దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు భారీగా సాగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 3.55 లక్షల వాహనాలు ఎక్కువగా ప్రయాణించాయి. నిరుడు లాక్‌డౌన్ నిబంధనల కారణంగా ఆర్టీసీ బస్సులు నడవలేదు. వ్యక్తిగత వాహనాలు అంతంతమాత్రంగానే నడిచాయి. ఈసారి పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ మార్గంలో ప్రజలు భారీగా ప్రయాణాలు చేశారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలోని పలు టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ గంటల తరబడి నత్తనడకన సాగింది. సుమారు 98 శాతం వరకు ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరిగాయి. గతేడాది ఇవి 68 శాతమే ఉన్నాయి. దసరా సందర్భంగా నాలుగు రోజుల్లో ప్రయాణించిన వాహనాల నుంచి టోల్ ద్వారా నిరుటి కన్నా ఈసారి సుమారు రూ.3.75 కోట్ల అదనపు ఆదాయం లభించటం విశేషం. గత సంవత్సరం రూ.11.95 కోట్లు రాగా.. ఈ దఫా రూ.15.70 కోట్ల ఆదాయం లభించింది. నిరుడు 7,31,840, ఈసారి 10,86,795 వాహనాలు రాకపోకలు సాగించాయి.
ఒక్క రోజే 46,500...
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా మీదుగా ఆదివారం ఒక్క రోజే 46,500 వాహనాలు ప్రయాణించాయి. వీటిలో 26,700 కార్లు ఉన్నాయి. మొత్తం వాహనాల్లో కార్లు 57.42 శాతం ఉండటం విశేషం. దసరా సందర్భంగా ఈ స్థాయిలో వాహనాలు వెళ్లడం ఇదే ప్రథమం. గతంలో గరిష్ఠంగా 43 వేల వరకు వాహనాలు వెళ్లేవని టోల్‌ప్లాజా వర్గాలు వెల్లడించాయి. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చినా ఫాస్టాగ్ విధానం అందుబాటులో ఉండటంతో 15-20 నిమిషాల వ్యవధిలోనే టోల్‌ప్లాజాను దాటివెళ్లాయి. ఫాస్టాగ్ రాకముందు ఇంతకంటే తక్కువ రద్దీ ఉన్నా గంటకు పైగా సమయం పట్టేది.
ఇదీ చదవండి: రైలు నుంచి దిగుతూ పడిపోయిన గర్భిణీ.. కాపాడిన పోలీసు