Revanth reddy in Women's Day: మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కృషి చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సమాజాభివృద్దిలో మహిళల పాత్ర మరువలేనిదన్నారు. కాంగ్రెస్ అత్యున్నత చట్ట సభల్లో మహిళలకు ప్రాముఖ్యత కల్పించిందని పేర్కొన్నారు.
కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే ఆరు నెలల్లోగా చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం సోనియాగాంధీ ప్రయత్నిస్తే మోదీ తొక్కిపెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహిళలకు నలుగురికి అవకాశం ఇస్తామన్నారు.
మద్యపాన నిషేధానికి కదిలిరండి
మహిళల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లీల్లోనూ గంజాయి, మందుసీసాలు దొరుకుతున్నాయని విమర్శించారు. తెలంగాణను వ్యసనపరుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇంట్లో మగవాళ్లు తాగుబోతులుగా తయారైతే ఇబ్బంది పడేది మహిళలే. గల్లీ గల్లీలో ఇవాళ బెల్టు షాపులు తెరిచిన కేసీఆర్ మహిళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈరోజు ఏ గల్లీలో చూసినా గంజాయి దొరుకుతోంది. ఏ పబ్లో చూసినా డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఏ సందులో చూసినా మందు సీసాలు దొరుకుతున్నాయి. తెలంగాణ మొదటిస్థానంలో ఉందంటే వ్యసనపరుల రాష్ట్రంగా మార్చిండు సీఎం కేసీఆర్. కావున మహిళ లోకం ఆలోచించాలి.
- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు