బీపీఎల్ కుటుంబాలు, ఎంఎస్‌ఎంఈలకు లాక్‌డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన ఉత్తమ్ లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులు బిల్లుల్లో లోపాలపై ఫిర్యాదులు చేస్తున్నారన్నారు.
కొవిడ్ నివారణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు కావడం వల్ల ఆ ప్రభావం ప్రతి కుటుంబంపై, ప్రతి వ్యక్తి జీవితంపై పడిందన్నారు. ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి పోయి ఆర్థికంగా ప్రజలు చితికిపోయారని తెలిపారు. వ్యక్తిగత జీవితంతోపాటు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలపై లాక్‌డౌన్ ప్రభావం చూపిందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నాన్ టెలిస్కోపిక్ విధానంలో బిల్లులు వేసి, వినియోగదారుల నడ్డి విరచడం ఏంటని ప్రశ్నించారు. వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులపై ఫిర్యాదు చేస్తుంటే.. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కానీ, ఇంధన శాఖ కానీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అంతేకాదు పెరిగిన, తప్పుడు బిల్లులను సకాలంలో చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 95 లక్షల విద్యుత్ వినియోగదారుల్లో, దాదాపు 75 లక్షలు మంది అంటే 80 శాతం మంది నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించేవారేనన్నారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ నెలవారీ ప్రాతిపదికన బిల్లులను ఆమోదించగా.. ఆ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, 90 రోజుల్లో వినియోగమైన యూనిట్లు ఆధారంగా బిల్లులు రూపొందించారని చెప్పారు. వినియోగదారులకు యూనిట్‌కు రూ.4.30లకు బదులు రూ. 9 పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందన్నారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'