తెదేపా అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో విశాఖకు వెళ్లకుండానే ఆయన అమరావతికి చేరుకోనున్నారు. ఎల్‌జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలు, బాధితులను పరామర్శించేందుకు ఇవాళ అక్కడ పర్యటించాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖపట్నం వెళ్లేందుకు, అక్కడి నుంచి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు వీలుగా ఆయన షెడ్యూల్ నిర్ణయించుకున్నారు. అయితే విశాఖపట్నం, విజయవాడ తదితర విమానాశ్రయాలకు సోమవారం రావాల్సిన విమాన సర్వీసులన్నీ రద్దుకావటంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
విశాఖ పర్యటనపై మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలకు అమరావతి నుంచే హాజరుకానున్నారు. మంగళగిరి సమీపంలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మహానాడు సందేశమివ్వనున్నారు.
ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతి
చంద్రబాబు విశాఖపట్నం పర్యటనకు రాష్ట్ర పోలీసు శాఖ అనుమతిచ్చింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లేందుకు ఈ-పాస్ జారీ చేసింది. ఈ మేరకు చంద్రబాబు చేసుకున్న దరఖాస్తును ‘‘ప్రత్యేక కేసు’’ కింద పరిగణించి అనుమతి ఇస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదివారం ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. నిత్యావసర సేవల విభాగం(ఎసెన్షియల్ సర్వీస్ ప్రొవైడర్) కింద ఈ-పాస్ జారీ చేశారు.
ఇదీ చదవండి: