BRSPP Meeting Today: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కేసీఆర్.. మధ్యాహ్నం భోజనానికి ఆహ్వావించారు. భోజనం అనంతరం సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ పార్టీగా పార్లమెంటులో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పోరాడుతూనే దేశవ్యాప్త అంశాలపై స్పందించే విధంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1న 2023 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. బడ్జెట్ ముద్రణ ప్రతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరినీ అనుమతించలేదు.
పది రోజుల ముందు ప్రతుల ముద్రణ: బడ్జెట్ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్‌మెంట్‌లో జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండి పోతారు. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. దీనిని ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు.
ఎన్నికల బడ్జెట్‌లో ఆ దూకుడును కొనసాగించకపోవచ్చు: కార్మిక సంఘాలు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ముందుకెళ్తున్న మోదీ ప్రభుత్వం.. ఎన్నికల బడ్జెట్‌లో ఆ దూకుడును కొనసాగించకపోవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా వేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరించే లక్ష్యాన్నిఈసారి రూ.40,000 కోట్లకే పరిమితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గత బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యానికి ఆమడ దూరంలో నిలవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల, ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం ఇందుకు కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: