Hyderabad CP CV Anand on drugs : యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి తమ ఉజ్వత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని.. డ్రగ్స్ దేశవ్యాప్త సమస్యగా మారిందని నగర కమీషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నార్కోటిక్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసలయ్యారని తెలిపారు. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక దినం సందర్భంగా డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన అవగాహనా కార్యక్రమానికి సీపీ హాజరయ్యారు. యూనివర్శిటీ గోడపై డ్రగ్స్‌పై అవగాహన కల్పించే విద్యార్ధులు వేసిన పెయింటింగ్‌ను తిలకించారు. మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నగరవ్యాప్తంగా రెండు రోజుల పాటు పలు యాంటీ డ్రగ్ కార్యాక్రమాలు నిర్వహించామని సీపీ తెలిపారు.
మాదకద్రవ్యాల సమస్య దేశవ్యాప్తంగా విస్తరించిందని..మన రాష్ట్రంలోకి ఎటువంటి మాదకద్రవ్యాలు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ఎన్నో ముఠాలను, సరఫరాదార్లను పట్టుకున్నామని.. దీంతో పాటు ప్రజల్లో అవగాహన రావడం ముఖ్యమన్నారు. భవిష్యత్తులో అన్ని ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పంజాబ్ రాష్ట్రంలో అవగాహన లోపం వల్ల అన్ని వర్గాల్లో మత్తుకు బానిసలయిన వారున్నారని.. ఇప్పుడు అక్కడ ప్రధాన సమస్యగా మారిందని ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల నుంచి డ్రోన్ల ద్వారా సరిహద్దు రాష్ట్రాలకు గంజాయిని అక్రమార్కులు సరఫరా చేస్తున్నారని.. షిప్పుల ద్వారా ఇతర దేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిపారు. ఇవన్నీ కట్టడి కావాలంటే యువతలో అవగాహన రావడమే ముఖ్యమని వెల్లడించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్ధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో(T-NAB) ఏర్పాటు చేశారు. దీనికి అధిపతిగా నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నారు.
"నార్కోటిక్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసలయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి తమ ఉజ్వత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. మాదకద్రవ్యాల సమస్య దేశవ్యాప్తంగా విస్తరించింది. మన రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి.. ముఠాలను, సరఫరాదారులను పట్టుకుంటున్నాము. హర్యానా రాష్ట్రంలో అవగాహన లోపం వల్ల అన్ని వర్గాల్లో మత్తుకు బానిసలయిన వారున్నారు. అక్కడికి డ్రగ్స్‌ను ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌ల నుంచి డ్రోన్ల ద్వారా సరిహద్దు రాష్ట్రాలకు కొకైన్, గంజాయిని అక్రమార్కులు సరఫరా చేస్తున్నారు". - సీవీ ఆనంద్, హైదరాబాద్ కమిషనర్
ఇవీ చదవండి: