రైళ్లలో అన్నీ రిజర్వేషన్ బోగీలే.. రిజర్వేషన్ ఖరారైన వారినే రైల్లో ఎక్కనిస్తాం’ అంటున్న రైల్వేశాఖ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సంక్రాంతి వేళ ఒక్కో రైల్లో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టు టికెట్లు జారీ చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతోంది. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. పండక్కి రెండు వారాల సమయం ఉండటంతో ఆఖరి రోజైనా బెర్తు దొరక్కపోదా? అన్న ఆశతో చాలామంది వెయిటింగ్ లిస్టులో టికెట్లు తీసుకుంటున్నారు. సంక్రాంతి జనవరి 14న ఉండటంతో 9 నుంచి 13 వరకు ప్రయాణాలకు డిమాండ్ ఉంది.
హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు.. మంచిర్యాల, కాగజ్‌నగర్ వైపు పెద్దసంఖ్యలో వెళ్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో రెగ్యులర్ రైళ్ల స్థానంలో పరిమితంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వేశాఖ పండగలకు ఈ సంఖ్య మరికొంత పెంచినా సరిపోవడంలేదు.
* హైదరాబాద్-విశాఖపట్నం(నం.02728) విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో 12వ తేదీ ప్రయాణానికి రిజర్వేషన్ పూర్తయినా వెయిటింగ్‌లిస్ట్ పేరుతో మరో 966 మందికి టికెట్లు ఇచ్చారు. 9న ప్రయాణానికి 808 మందికి, 10న 952, 11న 788, 13 808 మందికి వెయిటింగ్‌లిస్ట్ టికెట్లు జారీ అయ్యాయి.
* సికింద్రాబాద్-హావ్‌డా రైలులో నిరీక్షణ జాబితా పరిమితి కూడా దాటి ‘రిగ్రెట్’కు వెళ్లింది. 9-13 వరకు విశాఖపట్నం వైపు వెళ్లే అన్ని రైళ్లలో నిరీక్షణ జాబితా వందల్లో ఉంది.
* వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న టికెట్లన్నీ రద్దయిపోతాయి. వీరిని రైలెక్కనివ్వరు. ఒక్కో రైలులో ఐదారొందల నుంచి 900 మంది టికెట్లు రద్దవుతాయని అంచనా. టికెట్‌కు రూ.60 చొప్పున ప్రయాణికులకు నష్టం.
* ఆర్‌ఏసీ పేరుతో ఒక బెర్తులో రైల్వేశాఖ ఇద్దరిని కూర్చోబెడుతోంది. ఇలా ఒక్కో రైలుకు దాదాపు 150 మంది ప్రయాణికుల్ని అధికంగా అనుమతిస్తోంది. తద్వారా అదనపు ఆదాయం పొందుతోంది. కొవిడ్ నేపథ్యంలో ఒక బెర్తులో ఇద్దరిని కూర్చోబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీసీ సంక్రాంతి సర్వీసులకు డిమాండ్
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారితో ఏపీఎస్, టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో సీట్లన్నీ బుక్ అవుతున్నాయి. వివిధ ప్రాంతాలకు నిత్యం నడిపే సర్వీసులు నిండిపోవడం వల్ల ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వచ్చే సర్వీసులకు అధిక డిమాండ్ ఉంది. 9, 11, 12 తేదీల సర్వీసులన్నీ దాదాపు నిండిపోయాయి. ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులకు ముందస్తు ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. పండుగకు మొత్తంగా 3,607 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా, వీటిలో హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు 1,251 సర్వీసులు ఉన్నాయి.
ప్రైవేటులో ఛార్జీల మోత
సంక్రాంతి సమయంలో ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు రెట్టింపయ్యాయి. ఆర్టీసీలో ప్రత్యేక సర్వీసుల్లో సగం ఛార్జీ అదనంగా తీసుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో మాత్రం నిత్యం తిరిగే సర్వీసుల్లోనే ఛార్జీలనూ ఒక్కసారిగా పెంచేశారు.
ఇదీ చూడండి: కేసులు తక్కువే అయినా.. వేటికవే ప్రత్యేకం