RTC Buses Issues In TS : చాలా కాలం నుంచి సామాన్య ప్రజల అభిమానం ఆదరణ ఆర్టీసీకి దక్కుతోంది. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడుపుతూ, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ... వారి అవసరాలు తీరుస్తున్నాయి ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ ప్రయాణిస్తే సురక్షితంగా గమ్య స్థానం చేరుతామన్నది ప్రజల నమ్మకం. అయితే ఈ మధ్య కాలంలో ఆ పరిస్థితి మారిపోయింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్లపై మొరాయిస్తూ... అటు సిబ్బందిని, ఇటు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరో వైపు కాలం చెల్లిన బస్సులు రోడ్లపై పరుగులు తీస్తూ... ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం... ఆర్టీసీ పాలిట మరింత ఇబ్బందిగా మారింది. ఆ చట్టంలో చేసిన సవరణ ప్రకారం ఏప్రిల్ 1 నాటికి 15 ఏళ్లు దాటిన వాహనాలన్నింటిని పక్కన పెట్టాల్సిందే. ఈ మేరకు గత జనవరి 18న అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మొదటి దశలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాహనాలన్నింటిని ఉపసంహరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీని ప్రకారం టీఎస్‌ఆర్టీసీలోని 3వేల బస్సులను ఒకేసారి పక్కన పెట్టాల్సి వస్తుంది. వాటి స్థానంలో కొత్త బస్సులను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కసారిగా ఆర్టీసీ ఈ రేంజ్‌లో కొత్త బస్సులను సమకూర్చుకోవడం అంటే చాలా కష్టం.
టీఎస్‌ఆర్టీసీ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం 12 లక్షల కి.మీ తిరిగిన బస్సులను కాలం చెల్లిన కింద లెక్కిస్తుంది. లేదా వాటి సర్వీసు 15 ఏళ్లు పూర్తయ్యాక పక్కన పెట్టాల్సిందే. కానీ 17లక్షల కి.మీ తిరిగిన బస్సులను కూడా ఇంకా ఆర్టీసీ నడుపుతుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 15 లక్షల కి.మీలకు పైగా తిరిగిన బస్సులు 424.. 16 లక్షల కి.మీలకు పైగా తిరిగిన బస్సులు 338.. 17 లక్షల కి.మీకు పైగా తిరిగిన 331 బస్సుల్ని నడిపిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. వీటికి అదనంగా 15 ఏళ్లకు పైగా ప్రజా రవాణాలో కొనసాగుతున్న బస్సులు సుమారు 2 వేల వరకు ఉంటాయి. మొత్తంగా 3వేలకుపైగా బస్సులు కాలం చెల్లినవే ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆర్టీసీలోని 97 డిపోల్లో 9,092 బస్సులు ఉండగా.. 6,047 మాత్రమే సొంత బస్సులు. వీటిలో మూడు వేలకుపైగా అంటే సగానికి సగం బస్సులు కాలం చెల్లినవే నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు పాత బస్సులను తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదు.
టీఎస్ ఆర్టీసీ ఏడాదికి ఎన్ని బస్సులు కొనుగోలు చేస్తోందని సంబంధిత యూనియన్లు సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించాయి. దాని ప్రకారం.. గడచిన నాలుగేళ్లలో 1,309 బస్సులను కొనుగోలు చేసింది. 2014-15లో 117 బస్సుల్ని కొంటే... 2015-16 లో ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు. 2016-17లో 898, 2017-18 లో 294 బస్సులను కొన్నారు. 2019 - 2022 వరకు ఆర్టీసీ ఒక్క కొత్త బస్సును కొనుగోలు చేయలేదు. అయితే కొత్తగా 1,016 బస్సులను కొనుగోలు చేస్తున్నామని గత ఏడాది కాలంగా చెబుతున్నా.. ఇప్పటి వరకు 64 బస్సుల్ని మాత్రమే కొన్నారు.
2014 నుంచి వివరాలు ఇలా..:
- 2014-15 వ ఆర్థిక సంవత్సరంలో జేఎన్ఎన్‌యూఆర్ఎం 117 బస్సులను అశోక లే ల్యాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది.
- 2015-16 లో ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు.
- 2016-17 లో 898 బస్సులను కొనుగోలు చేశారు.
- ఇందులో 22 గరుడ ప్లస్ బస్సులను వోల్వో, స్కానియా కంపెనీల నుంచి కొనుగోలు చేశారు.
- 91 రాజధాని బస్సులను ఎం.జి.ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కొన్నారు.
- 383 సూపర్ లగ్జరీ బస్సులను ముంగీ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, టి.ఎస్.ఆర్.టీ.సి బి.బి.డబ్ల్యూ/మియాపూర్ నుంచి కొనుగోలు చేశారు.
- 302 ఎక్స్ ప్రెస్ బస్సులను లోకల్ తయారీదారుల నుంచి కొనుగోలు చేశారు.
- 40 పల్లె వెలుగు మిని బస్సులను ఎం.జి ఆటోమోటీవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు.
- 60 వజ్ర మినీ బస్సులను ఎం.జి ఆటో మోటీవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు.
- 2017-18 లో 294 బస్సులను కొనుగోలు చేశారు.
- ఇందులో 25 గరుడ ప్లస్ బస్సులను ఓల్వో, స్కానియా కంపెనీల నుంచి కొనుగోలు చేశారు.
- 40 వజ్ర మినీ బస్సులను ఎం.జి ఆటోమోటీవ్స్ ప్రైవేట్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు.
- 35 సూపర్ లగ్జరీ బస్సులను ముంగీ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సాన్వీ ఇంజనీర్స్, హైదరాబాద్ కోచ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు.
- 86 పల్లె వెలుగు బస్సులను ఎంజీ ఆటోమోటీవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు.
- 108 పల్లె వెలుగు ఎక్స్ ప్రెస్ బస్సులను వివిధ స్థానిక కంపెనీల నుంచి కొనుగోలు చేశారు.
- రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బడ్జెట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
ఇవీ చదవండి: