‘ఈనాడు ఈటీవీ భారత్’ ప్రతినిధులు ఈ పరీక్షలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని పరిశీలించగా.. కేవలం రెండు వాహనాలే పరీక్షలు నిర్వహించాయి. అదీ నామమాత్రంగానే! స్థానికులకు ముందు రోజే సమాచారం అందకపోవడం, కంటైన్‌మెంట్ జోన్ల సమాచారం ప్రజలకు చేరకపోవడంతో వాహనాల వద్ద పరీక్షల సంఖ్య అంతంత మాత్రంగా ఉంది. సంచార వాహనాల్లో ఉంటున్న సిబ్బంది 300లకుపైగా పరీక్షల కిట్లు తీసుకొస్తుంటే.. అందులో 20శాతం మాత్రమే వినియోగమవుతున్నాయి. ఒకవైపు పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద జనం బారులు తీరుతుంటే.. సంచార వాహనాలు మాత్రం వెలవెలబోతున్నాయి. ఈ సేవల్లో జీహెచ్‌ఎంసీ, వైద్యాధికారుల మధ్య సమన్వయం కొరవడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
స్పందన నామమాత్రం..
- మూసారంబాగ్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం ప్రజలు పదుల సంఖ్యలో వచ్చారు. వర్షంలో తడుస్తూనే పరీక్ష చేయించుకున్నారు.
- అక్బర్‌బాగ్ పల్టాన్ మైదానంలోని సంచార పరీక్ష కేంద్రం వద్ద ఒకరిద్దరే ఉన్నారు. మధ్యాహ్నం వరకు 20 మంది మాత్రమే నమూనాలు ఇచ్చారు. రాష్ట్ర వైద్య సంచాలక కార్యాలయం నుంచి 300లకుపైగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కిట్లను తీసుకొచ్చామని వాహనంలోని వైద్య సిబ్బంది ‘ఈనాడు’కు తెలిపారు.
- రహ్మత్‌నగర్‌లో సంచార వాహనం మధ్యాహ్నం 12.30గంటలకు వచ్చింది. అరగంట తర్వాత పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టగా.. పదీ, పదిహేనుమంది మాత్రమే ఉన్నారు. ఆ సంచార వాహనం ద్వారా ఒకసారి ఇద్దరి నుంచే శాంపిల్స్ తీసుకునే సౌలభ్యం ఉంది.
చిరునామాలు గల్లంతు..
సంచార పరీక్ష కేంద్రం వాహనం వద్ద సిబ్బంది ప్రజల నుంచి చిరునామా, ఫోన్ నెంబరు, ఆధార్‌కార్డు వివరాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సిబ్బంది కేవలం ఆధార్‌కార్డులోని చిరునామానే దరఖాస్తులో చేర్చుతున్నారు. దీనివల్ల పాజిటివ్ కేసులను గుర్తించడంలో గందరగోళం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంది ఆధార్ కార్డుల్లో చిరునామా, వాళ్లు నివసించే ప్రాంతం వేరుగా ఉంటున్నాయి. బాధితుడు చెప్పే వీధి, ఇంటి నెంబరు నమోదు చేసుకోకపోతే.. కొవిడ్ వచ్చిందని తేలినప్పుడు వాళ్లను గుర్తించి, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించడం సాధ్యం కాదు. దీంతోపాటు ఎప్పుడో ఆధార్ తీసుకున్నవారి కొందరి ఫోన్ నంబర్లు మారిపోయి ఉంటాయి.
ఇదీ చదవండి: కరోనాపై మోదీ పోరుకు గ్రామీణ భారతం ఫిదా!