దొంగలు అంటే గాట్లు తేలిన మొహంతో... చేతిలో మారణాయుధాలు పట్టుకుని పాత సినిమాల్లో కనిపించినట్లు భయంకరంగా ఉండట్లేదు... వాళ్లూ ట్రెండ్ మార్చారు. స్టైలిష్‌గా కనిపిస్తూనే కొల్లగొట్టేస్తున్న కేటుగాడిని లాలాగూడ పోలీసులు పట్టుకున్నారు. వేసిన చొక్కా.. మళ్లీ వేయడు. ఖరీదైన వాటినే కొనుగోలు చేస్తాడు. అతనెవరో ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తో, వ్యాపారవేత్తనో అనుకున్నారు. పక్కా దొంగ. తాళాలు వేసిన గృహాల్లో సొత్తు ఎత్తుకెళ్లి తాకట్టుపెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేస్తాడు. ఆ డబ్బు ఖర్చు అయ్యాకే మళ్లీ చోరీకి దిగుతాడు. పోలీసులకు చిక్కితే ఒంటిపై ఒక్క దెబ్బ పడకముందే నేరాలను ఒప్పేసుకుంటాడు.
అలా మొదలైంది
ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన సతీష్‌కుమార్‌నాయుడు 16వ ఏటా 1994లో ఇంటి నుంచి పారిపోయి నగరానికి వచ్చాడు. అప్పటి నుంచి జల్సాలను అలవాటుపడి చోరీల బాటను ఎంచుకున్నాడు. తొలిసారి దొంగతనం చేసి జువైనల్ హోంకు వెళ్లి వచ్చాడు. తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లివచ్చేవాడు. చోరీచేసిన డబ్బుతో ఖరీదైన దుస్తులు, షూలు కొనుక్కునేవాడు. చొక్కాలు, ప్యాంట్లను ఒక్కసారి మాత్రమే ధరించేవాడు. మిగిలిన నగదుతో విజయవాడ, వైజాగ్, తిరుపతి తదితర ప్రదేశాలకు వెళ్లి జల్సాలు చేసేవాడు.
ఇలా జరుగుతూ వచ్చింది
గతేడాది సెప్టెంబరు 17న జైలు నుంచి వచ్చాక అదే నెల 27న లాలాగూడ ప్రాంతంలో తాళం వేసిన ఇంట్లో చొరబడి 1.28 తులాల పుస్తెలతాడు, 3 గ్రాముల డైమండ్ రింగ్, 2 గ్రాముల బంగారు ఉంగరం, 1.5 తులాల బంగారు గొలుసు, మూడు చిన్న బంగారు ఉంగరాలు కలిపి మొత్తం 4 తులాల ఏడున్నర గ్రాముల బంగారం ఎత్తుకెళ్లాడు. వాటిని తాకట్టు పెట్టడానికి గాంధీ ఆసుపత్రి సమీపంలో భిక్షాటన చేసే మహిళ సహకారం తీసుకున్నాడు. ప్రైవేటు ఫైనాన్స్‌లో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బు ఖర్చయ్యాక మళ్లీ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసి 4 తులాల బంగారు ఆభరణాలను అపహరించి తద్వారా వచ్చిన నగదుతో వైజాగ్, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేశాడు. గోపాలపురం, చిలకలగూడ పరిధిలోనే నాలుగుసార్లు దొంగతనాలు చేశాడు. నగదు పూర్తిగా ఖర్చు అయ్యాకే మళ్లీ చోరీకి పాల్పడడం అతనికి అలవాటు.
ఎలా చిక్కాడు
ఈ నెల 20న లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌లో చోరీ చేయడానికి ప్రయత్నించగా స్థానికులు గమనించి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ నెల 21న మెట్టుగూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం తెలిసింది. నిందితుడి నుంచి నాలుగు చేతి ఉంగరాలు, రెండు చెవి దుద్దులు, రెండు లాకెట్లు, గొలుసు, చిన్న చిన్న ఉంగరాలు కలిసి రూ.3.2 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలను, ఇత్తడి సామగ్రిని స్వాధీనం చేసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి: 'సైబర్‌నేరాల నియంత్రణపై శ్రద్ధ అవసరం'