Two Private Doctors license canceled : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల పొరపాటులను గుర్తించి, ఇద్దరు ప్రైవేటు వైద్యుల గుర్తింపును రద్దు చేసింది. ఎడమ కాలికి ఆపరేషన్ చేయ్యాల్సింది పోయి కుడి కాలికి చేసిన డాక్టర్‌పై 6 నెలల పాటు, రోగి పట్ల నిర్లక్ష్యం వహించిన మరో వైద్యుడిపై 3 నెలలు వేటు వేసింది. అనంతరం గుర్తింపు రద్దుపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పంచింది.
కుడి ఎడమైంది.. పొరపాటైంది : కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని ఓ సినీ కవి అన్నారు కానీ.. అది అన్నింట్లో వర్తించదనేది మాత్రం అందరూ గ్రహించాల్సిన విషయం. ఇక్కడ ఓ వైద్యుడు ఎడమ కాలికి చేయాల్సిన ఆపరేషన్ కుడి కాలికి చేశాడు. చివరకు తన గుర్తింపు రద్దయ్యేలా చేసుకున్నాడు. ఈ ఘటన ఈసీఐఎల్ లో చోటు చేసుకుంది.
కరణ్ ఎం. పాటిల్ అనే ఆర్థోపెడిషియన్ అదే ప్రాంతంలో ఉంటున్నాడు. ఒక రోగి తన ఎడమ కాలికి బాగోలేదని డాక్టర్‌ను సంప్రదించాడు. ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పగా ఆ రోగి ఓకే అన్నాడు. అనంతరం అతడి కుడి కాలికి డాక్టర్ శస్త్ర చికిత్స చేశాడు. రెండ్రోజుల తర్వాత వారు సర్జరీ చేయాల్సింది కుడి కాలికి కాదని గుర్తించారు. అనంతరం ఆ రోగికి మళ్లీ ఎడమ కాలికి ఆపరేషన్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన అధికారులు వైద్యుడి తప్పిదాన్ని నిర్ధారించి అతడి గుర్తింపును 6 నెలల పాటు రద్దు చేశారు.
డాక్టర్ నిర్లక్ష్యం... రోగి మృతి : డెంగీతో బాధ పడుతున్న రోగి విషయంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌పై 3 నెలలు వేటు పడింది. మంచిర్యాల జిల్లా వాసి డెంగీతో బాధపడుతూ.. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరగా అతనికి శ్రీకాంత్ అనే డాక్టర్ చికిత్స చేశారు. రోగి పరిస్థితిని సరిగ్గా గమనించని డాక్టర్ అతడిని మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించాలని సిఫార్సు చేయలేదు. ఈ క్రమంలో అతడి ఆరోగ్యం క్షీణించి మృతి చెెందాడు.
వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి చనిపోయాడని గ్రహించిన కుటుంబ సభ్యులు జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు.. వైద్యుడి నిర్లక్ష్యాన్ని నిర్ధారించారు. కలెక్టర్ నివేదిక ప్రకారం రాష్ట్ర వైద్యమండలి శ్రీకాంత్ గుర్తింపును రద్దు చేశారు. గుర్తింపును రద్దు చేసిన రాష్ట్ర వైద్యమండలి 60 రోజుల్లో రద్దుపై అప్పీల్ చేసుకునేందుకు వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: