హైదరాబాద్... ఐటీ హబ్‌లకే కాదు... ఫార్మా ఇండస్ట్రీలకు చిరునామా. అయితే, ఐటీ పరిశ్రమలు నెలకొన్న ప్రాంతాల్లో హైటెక్ జీవితాలు ఉంటే.... రసాయనిక కంపెనీల చుట్టూ మాత్రం దుర్భర జీవితాలు తారసపడుతున్నాయి. కనీస బాధ్యతను విస్మరించి పరిశ్రమలు.... పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్రభుత్వాలు చెబుతున్నా...కోర్టులు సూచిస్తున్నా... హరిత ట్రైబ్యునల్ పర్యవేక్షిస్తున్నా.... పారిశ్రామిక వాడల పరిసర ప్రాంతాల జీవితాలు మాత్రం మారడం లేదు. ఏళ్లకేళ్లుగా సమస్యలు అలాగే మిగిలిపోవడంతో... కాలుష్య కోరల్లోనే కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది.
ఘాటు వాసన వస్తుందంటే.. వాహనాలు, చెత్త చెదారం కాల్చడం, అధ్వాన రహదారులు, నిర్మాణ పనులు తదితర కారణాలతో గాల్లోకి నిత్యం 40కిపైగా కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఈ జాబితాలో సూక్ష్మ ధూళి రేణువులు (పీఎం 10), అతి సూక్ష్మ ధూళి రేణువులు (పీఎం 2.5), నైట్రోజన్ ఆక్సైడ్లు, బెంజిన్, సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా తదితరాలుంటాయి. ఘాటు వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తుందంటే ఆ ప్రాంతంలో అమ్మోనియా తీవ్రత ఎక్కువగా ఉందన్నమాట. ఆ వాతావరణంలో ఎక్కువసేపు ఉంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, వికారం, వాంతులు, కళ్లు తిరగడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఎందుకిలా...
నగర కాలుష్యంలో వాహనాల వాటానే 65-70 శాతం వరకు ఉంటుంది. 50 లక్షలపైన వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు నల్లటి పొగ రూపంలో గాల్లోకి విడుదలవుతుంటాయి. అందులోనే అమ్మోనియా కూడా ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కొన్నిరకాల చెట్లు, పరిశ్రమలు కూడా కారణమని వివరిస్తున్నారు.
ఇదీ చూడండి: కలుషిత నీరు తాగిన ఘటనలో ఆరుకు పెరిగిన మృతులు