Arrest of a gang sending fake documents to America : ఓ వ్యక్తి నకిలీ పత్రాలను తయారు చేసి, వీసా జారీలో కొన్ని లొసుగులను ఉపయోగించుకుని అమెరికా పంపిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులుగా వీసా ఇంటర్వ్యూలో చెప్పే విధంగా పథకం వేస్తున్నాడు. ఇప్పటికే ఇలా కొంత మందిని అమెరికాకు పంపించాడు. ఈ క్రమంలోనే రైతును ప్రభుత్వ ఉద్యోగిగా చూపించి పోలీసులకి చిక్కాడు. దీంతో మొత్తం వివరాలు బయటకి తీశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ మచ్చ బొల్లారం స్రవంతి నగర్‌కు చెందిన గార్లపాటి వెంకటదుర్గా నాగేశ్వర సిద్ధార్థ అలియాస్ విల్సన్ చౌదరి.. గత ఆరేళ్లుగా సెయింట్ ఆంటోనీ ఇమ్మిగ్రేషన్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన ప్రభాకర్‌రావు అతనికి సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. కన్సల్టెన్సీ అనుభవంతో వీసా జారీలో కొన్ని లొసుగులు తెలుసుకున్న విల్సన్ చౌదరి.. డబ్బు కోసం ఈ సరికొత్త మోసానికి తెరలేపాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని.. ఈ దందా కొనసాగిస్తున్నాడు. అర్హతలు లేకున్నా నకిలీ పత్రాలు సృష్టిస్తున్నాడు.
తెలివిగా స్పాన్సరింగ్ లెటర్లు సేకరణ : అమెరికాలో ఆరు నెలలు ఉండేందుకు అవకాశమిచ్చే విజిటింగ్ వీసా వచ్చేలా పథకం వేశాడు. ఇందుకోసం ఇప్పటికే అమెరికాలో ఉంటున్న శాశ్వత నివాసితులు, ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారు.. తమ బంధువులు, కుటుంబ సభ్యుల్ని అక్కడికి రప్పించేందుకు జారీ చేసిన ‘స్పాన్సరింగ్ లెటర్లు అక్రమంగా సేకరిస్తున్నాడు. వీటిలో సదురు వ్యక్తులు తమ బంధువులంటూ రాసిన పేర్లను ఆన్‌లైన్‌లో ఎడిట్ చేసి.. తన దగ్గరికి వచ్చిన అభ్యర్థుల పేర్లను చేరుస్తున్నాడు. అనంతరం ఆయా వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులంటూ.. వివిధ శాఖల పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులు, వివిధ పత్రాలు సృష్టిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయితే.. ఇమ్మిగ్రేషన్ అధికారులు త్వరగా నమ్ముతారని, ఎక్కువ కాలం అమెరికాలో ఉండకుండా తిరిగొస్తారనే ఉద్దేశంతో ఈ నకిలీ గుర్తింపు కార్డులు ఇస్తున్నాడు. వీటితో అభ్యర్థుల్ని వీసా ముఖాముఖికి పంపిస్తున్నాడు.
రెండు సంవత్సరాల్లో 60 మంది వీసాకి దరఖాస్తు : వీసా వచ్చినా.. రాకున్నా అభ్యర్థులు విల్సన్‌కు రూ. 1.5 లక్షలు ఇవ్వాల్సిందే. ఒకవేళ వీసా వస్తే రూ.5 లక్షలు ఇవ్వాలి. వీసా ముఖాముఖి సమయంలో నాగరాజు సాయం తీసుకుంటున్నారు. ముఖాముఖి రోజు అతని సాయంతో అభ్యర్థుల ఖాతాల్లో రూ. 40 లక్షలు జమ చేస్తాడు. పూర్తయ్యాక తిరిగి డబ్బు వెనక్కి తీసుకుంటున్నారు. ఇందుకు రోజుకు 1.5 శాతం చొప్పున కమీషన్ తీసుకుంటున్నారు. ఇలా నిందితుడు విల్సన్.. దాదాపు రెండేళ్ల వ్యవధితో 60 మంది అభ్యర్థుల పేర్లతో నకిలీ స్పాన్సరింగ్ లేఖలు, గుర్తింపు కార్డులు సృష్టించి వీసా కోసం దరఖాస్తు చేయించాడు. ఇందులో 10 మంది దరఖాస్తులకు ఆమోదం రావడంతో వారు అమెరికా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
రైతు ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు : ఇదే క్రమంలో బుస్సాపూర్‌కు చెందిన జక్కుల నాగేశ్వర్ కోసం నకిలీ స్పాన్సరింగ్ లేఖ తయారు చేసిన విల్సన్.. అతన్ని తెలంగాణ నీటి పారుదల శాఖలో అకౌంట్స్ అధికారిగా చూపిస్తూ నకిలీ గుర్తింపు కార్డు సృష్టించాడు. గ్రామంలో వ్యవసాయం చేసుకునే నాగేశ్వర్‌ని.. ప్రభుత్వ ఉద్యోగిగా చూపించడంతో పోలీసులే విస్తుపోయారు. అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేయగా అసలు విషయాలు బయటకి వచ్చాయి. దీంతో పోలీసులు విచారించగా.. నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.7.02 లక్షలు, రూ.18 వేల నగదు, ఐదు పాస్‌పోర్టులు, 17 నకిలీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు, 279 చెక్కులు, నకిలీ ఇన్విటేషన్ లెటర్లు, వీసా ఫీజు రసీదు, కంప్యూటర్, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: