ఇంటర్ రెండేళ్లకు ఒకే హాల్‌టికెట్ సంఖ్య కేటాయించనున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. ఎంసెట్‌లో వందలాది మంది విద్యార్థులు రెండో ఏడాది సంఖ్య బదులు మొదటి సంఖ్య నమోదు చేసి ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఒక్కో ఏడాదికి ఒక సంఖ్య కేటాయించడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్న మాట వాస్తవమేనన్నారు.
సిలబస్ తగ్గింపుపై ఓ ఉప సంఘాన్ని నియమించి కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆమోదం కోసం ఇటీవల ప్రభుత్వానికి సమర్పించామన్నారు. అంతర్గత మార్కులు 20 శాతం ఉండేలా ప్రతిపాదించామని, ప్రభుత్వం నుంచి దానికి ఇంకా ఆమోదం లభించలేదని తెలిపారు. దానిపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి పంపాలని ప్రభుత్వం సూచించిందని, కరోనా వల్ల ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభించలేదన్నారు.
ఇంటర్‌లో అధిక మార్కులు వచ్చినా...ఎంసెట్‌లో కనీస మార్కులు సాధించకపోవడంపై ఆయన మాట్లాడుతూ పరీక్షల విధానంలో కొన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 1661 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 2020-21 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయని, వాటిలో ఇప్పటివరకు 355 కళాశాలలకు అనుమతి ఇచ్చామన్నారు. 306 కళాశాలలకు ఫీజు చెల్లించాలని సూచించినట్లు చెప్పారు. మరో 354 కళాశాలలు దుకాణాలు, నివాస గృహాలున్న సముదాయాల్లో ఉన్నందున అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం సమర్పించాల్సి ఉందని తెలిపారు. 646 కళాశాలలకు సంబంధించి అనుమతులు వివిధస్థాయుల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఉభయ రాష్ట్రాల అంగీకారం