రాష్ట్రంలో పండే బత్తాయి, మామిడి వంటి పండ్ల రవాణకు కేంద్రంతో కలిసి అనుసరిస్తున్న విధానమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్రం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పండ్ల రవాణాకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఏం చర్యలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని తెలిపింది.
రైతులు నష్టపోతున్నారంటూ
పండ్ల రవాణాకు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారంటూ మాజీ వెటర్నరీ డాక్టర్ కె.నారాయణరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పండ్లను రైతులు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో విక్రయించుకోలేక పోతున్నారని.. ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ఎగుమతి చేసుకోవాల్సి ఉంటుందని పిటిషనర్ తరుఫు న్యాయవాది సీహెచ్ నరేష్‌రెడ్డి వాదించారు.
పండ్ల ఎగుమతులకు
ఏజీ బీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ పండ్ల ఎగుమతులకు అన్నిఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇక్కడి ఉత్పత్తుల్లో 4 నుంచి 5 శాతం మాత్రమే రాష్ట్రంలో వినియోగం ఉంటుందని, మిగిలినవి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి ఉందని, దీనికి ఉన్న అడ్డంకులను తొలిగించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. తెలంగాణలో తగినన్ని కోల్డ్‌స్టోరేజ్‌లు కనిపించడంలేదని, అదే ఉత్తరప్రదేశ్‌లో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక కోల్డ్‌స్టోరేజ్‌లు కనిపిస్తాయని వ్యాఖ్యానించింది.
పండ్లను రవాణా చేయడానికి
రాష్ట్రంలో కోల్డ్‌స్టోరేజ్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఏజీ తెలిపారు. పండ్ల రవాణాకు కేంద్రం ఎందుకు సహకరించడంలేదని కేంద్రం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాలకు ఈ పండ్లను రవాణా చేయడానికి కేంద్రం సహకరించాలని, అవసరమైనతే ఇతర రాష్ట్రాలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలంది. ఏం చర్యలు తీసుకుంటున్నారో నివేదికను సమర్పించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను 22కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి : ఆ విషయంలో కేంద్రం బాధ్యత సున్నా: కేటీఆర్