సాధ్యమైన చోట కోర్టులు తెరిచేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తులకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. వీలు ఉన్న చోట కోర్టులు తెరిచేందుకు ఏవైనా సదుపాయాలు అవసరం అనుకుంటే... ఈ నెల 30లోగా ప్రతిపాదనలు సమర్పించాలని యూనిట్ హెడ్లకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 14 వరకు కోర్టులు, ట్రిబ్యునళ్ల లాక్ డౌన్ పొడిగించి.. అత్యవసర అంశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని ఇటీవల హైకోర్టు నిర్ణయించింది.
జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కరోనా ప్రభావం లేని చోట కోర్టుల సాధారణ విచారణలు పునరుద్ధరించాలని న్యాయవాదులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైన చోట తగిన జాగ్రత్తలతో కోర్టులు తెరిచేందుకు జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. అయితే జిల్లా పరిపాలన న్యాయమూర్తి, న్యాయాధికారులు, న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టుల నిర్వహణకు అవసరమైతే పోలీసుల భద్రత ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్ వేయాల్సిందే!