దేశంలోని న్యాయస్థానాల్లో పెరిగిపోతోన్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. న్యాయ విద్య, పరిశోధన-కొవిడ్ సవాళ్లు అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో 10 రోజుల ఆన్‌లైన్ కార్యశాలను గవర్నర్ ప్రారంభించారు.
పెరుగుతున్న టెక్నాలజీ, కుటుంబ సభ్యుల సమస్యలు మొదలు అంతర్జాతీయ స్థాయి సమస్యలు కొత్త సవాళ్లు విసురుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో విషయ పరిజ్ఞానం, లోతైన అవగాహన, నైపుణ్యాలున్న విద్యార్థులను తీర్చిదిద్దేలా న్యాయవిద్య పరిధి విస్తృతం కావాలని తమిళిసై పేర్కొన్నారు. కరోనా మొత్తం విద్యారంగానికే సవాలు విసిరిందని.. అయితే లాక్‌డౌన్ విద్యా సంస్థలకే కానీ విద్యకు కాదని వ్యాఖ్యానించారు.
ప్రతి సమస్య కొన్ని కొత్త అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్న గవర్నర్.. కొవిడ్ సంక్షోభం విద్యారంగంలో కొత్త తరహా ఆన్‌లైన్, డిజిటల్ లెర్నింగ్, టీచింగ్ అవకాశాలను కల్పించిందని తెలిపారు. కొత్తగా వస్తున్న జాతీయ స్థాయి న్యాయ పాఠశాలలకు దీటుగా సంప్రదాయ విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలు కూడా సిలబస్ రూపకల్పన, వసతులు సమకూర్చుకొని అత్యుత్తమ న్యాయ విద్యను అందించాలని తమిళిసై పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక