దళితుల సమగ్ర సాధికారతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. దళితబంధు కోసం దశల వారీగా రూ.80 వేల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం.. విజయవంతం కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించనుంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్న హుజూరాబాద్ నియోజకవర్గ దళితులతో సీఎం కేసీఆర్ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. హైదరాబాద్ ప్రగతిభవన్లో జరగనున్న సమావేశానికి.. ఒక్కో గ్రామం నుంచి మహిళలు, పురుషులను ఇద్దరు చొప్పున ఆహ్వానించారు. మున్సిపాలిటీల్లోని వార్డుల నుంచి కూడా మహిళలు, పురుషులకు ఇద్దరు చొప్పున ఆహ్వానం అందింది. మరో 15 మంది రీసోర్స్ పర్సన్స్ కూడా సమావేశంలో పాల్గొంటారు.
విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు..
తెలంగాణ దళిత బంధు పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ మరియు విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సమావేశంలో అవగాహన కల్పిస్తారు. పథకం ముఖ్య ఉద్దేశం, అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తారు.
పైలట్ ప్రాజెక్టు అమల్లో స్థానిక దళితులుగా పోషించాల్సిన పాత్ర, లబ్ధిదారుల గుర్తింపు, ఎంపిక, ఎంచుకోవాల్సిన ఉపాధి అవకాశాలు, అధికారులతో సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు. దళితబంధు తదుపరి కార్యాచరణపై కూడా సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.