Metro suvarna lucky draw: మెట్రోను లాభాల బాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో విషయంలో ఎల్అండ్టీ సంస్థకు ఎలాంటి భయాలు వద్దని.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మెట్రో రైల్.. సువర్ణ లక్కీ డ్రా స్కీమ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నవంబరు నెల రెండో మెట్రో లక్కీ డ్రాను హైదరాబాద్ అమీర్‌పేటలోని మెట్రో స్టేషన్‌లో నిర్వహించి.. విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎల్అండ్టీ ఎండీ కేవీబీ రెడ్డి, సీఓఓ సుధీర్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రయాణికులు పెరిగారు
సువర్ణ ఆఫర్లను ప్రకటించిన తర్వాత మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 2 లక్షల 40 వేల మంది ప్రయాణిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి నెలా 20 శాతం ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని వివరించారు.
సమయం ఆదా
అత్యుత్తమ లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం ర్యాపిడ్ సంస్థతో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందని కేవీబీ రెడ్డి అన్నారు. మెట్రో సువర్ణ ఆఫర్ విజేతలను ఆయన అభినందించారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేకత ఉందని కొనియాడారు. మెట్రోలో ప్రయాణం చేయడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు సౌలభ్యంగా ఉంటుందని మెట్రో సువర్ణ ఆఫర్ విజేతలు అంటున్నారు.
ఇదీ చదవండి: ఆ జీవోను ఉపసంహరించుకోవాలని కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ