తెలంగాణలో రాగల మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు... విస్తారంగా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని ఒకట్రెండు ప్రదేశాల్లో భారీవర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వారం రోజులుగా రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలుగుతోంది. వర్షాలు విస్తారంగా కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పలు చోట్ల రహదారులు కొట్టుకుపోగా... వంతెనలు తెగాయి. చెరువు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలను వరద ముంచెత్తింది. ఇటీవల నాట్లేసిన వరి చేలు, మొక్కజొన్న, కంది, కూరగాయ పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయా గ్రామాల మధ్య రోడ్డుపై ఉన్న లోతట్టు వంతెనలు మునిగిపోవడంతో రాకపోకలు నిలచిపోయాయి. పలుచోట్ల అప్రోచ్ రహదారులు వరద ఉద్ధృతికి తెగిపోవడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.
ఈనెల 23వ తేదీన వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు స్పష్టం చేశారు. ఆదివారం సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి... నేడు బలహీనపడిందని వివరించారు.
ఇదీ చూడండి: హెచ్చరికలు పట్టించుకోకుండా వెళ్లారు.. చివరకు..