ఫిట్‌మెంట్ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులను మూడేళ్లుగా ఊరించి ఇప్పుడు ఉసూరుమనిపించారని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి మూడేళ్ల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఫిట్‌మెంట్ 7.5 శాతం ఇచ్చి హెచ్‌ఆర్‌ఏ 6 శాతం తగ్గించాలని ప్రతిపాదించడం దారుణమన్నారు. రోజురోజుకీ ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్‌ఆర్‌ఏని తగ్గించాలనుకుంటారా? అని నిలదీశారు. ఉద్యోగులు కోరినట్లు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. పీఆర్‌సీ వేసినప్పుడు ఐఆర్ ఇవ్వడం సంప్రదాయమని.. కానీ అదీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఒక్కో పేరుతో.. ఒక్కొక్కరిని..
ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను, సన్న బియ్యం పేరుతో రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయనిచ్చిందా? లేదా బలవంతంగా పీఆర్‌సీ రాయించారా? అని ప్రశ్నించారు. కమిటీపై ఒత్తిడి పెంచి రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా నివేదికను రాయించిందని ఆరోపించారు.
సమైక్య పాలనలో కూడా ఇంత తక్కువ ఇవ్వలేదు
మూడేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చేది ఇదేనా? అని నిలదీశారు. ఇంత దారుణమైన, అతి తక్కువ ఫిట్‌మెంట్‌ను ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇవ్వలేదని సంజయ్ ఆరోపించారు.
ఇదీ చూడండి: పీఆర్సీపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: శ్రీనివాస్ గౌడ్