గాంధీభవన్లో శుక్రవారం మూడోరోజు కూడా కాంగ్రెస్ నేతల అభిప్రాయ సేకరణ కొనసాగనుంది. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యాక్షుల నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ అభిప్రాయాలు తీసుకున్నారు. బుధ, గురువారాల్లో 65మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.
శుక్రవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీగా పోటీ చేసిన వాళ్లు, అనుబంధ సంఘాల అధ్యక్షుల అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు అభిప్రాయాలను తెలియజేసిన వారిలో ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు ఉండటంతో నిర్దేశించిన సమయం 10 నిమిషాల కంటే ఎక్కువ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం నుంచి జరిగే కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందో చెప్పడమే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- ఇదీ చదవండి: నేడు హస్తినకు ముఖ్యమంత్రి కేసీఆర్