సచివాలయ నిర్మాణ పనులపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఏడాదిలోగా పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ... కరోనా సెకండ్‌వేవ్‌తో అనుకున్న వేగంగా పనులు ముందుకు సాగలేదు. ఏడు అంతస్తుల్లో ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం జరుగుతోంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా... అత్యాధునిక సదుపాయాలతో విశాలంగా నిర్మిస్తున్నారు.
24 గంటలు జరుగుతున్న నిర్మాణ పనులు
సచివాలయంలోని మొత్తం ఏడు అంతస్తులకు గాను ప్రస్తుతం మొదటి అంతస్తు స్లాబ్ పనులన్నీ పూర్తయ్యాయి. మరోవైపు రెండు, మూడు అంతస్తుల స్లాబు పనులు జరుగుతున్నాయి. ఇక నుంచి పనులన్నీ వేగంగా జరుగుతాయని అధికారులు అంటున్నారు. ఇటీవల సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్... పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆయా పనులకు సంబంధించిన గడువులు, వాటి ప్రస్తుత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వెయ్యి మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు సచివాలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు.
మరో తొమ్మిది నెలల్లోనే..!
పనులు ఇదే తరహాలో సాగితే పూర్తయ్యేందుకు మరో తొమ్మిది నెలల సమయం పడుతుందని అంచనా. అదే జరిగితే వచ్చే ఏడాది జూన్ లేదా దసరా వరకు సచివాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. భవనానికి ముందు భాగంలో రాజస్థాన్ దోల్పూర్కు చెందిన ఇసుకరాయిని ఉపయోగించనున్నారు. దీనికోసం ఆర్అండ్బీ ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం రాజస్థాన్ వెళ్లి క్వారీలను పరిశీలించి రాయిని ఎంపిక చేశారు. ఆ రాయిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పరిశీలించారు.
పరిశీలనలు, సూచనలు
అటు భవన నిర్మాణం పూర్తయ్యాక ఉపయోగించే సామాగ్రిని సిద్ధం చేసుకునేందుకు ఇప్పటికే గడువులు నిర్ధేశించారు. ఫ్లోరింగ్, బండలు, రాళ్లు, ద్వారాలు, కిటికీలు, టైల్స్ తదితరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంది. వాటి నమూనాలను కొన్నింటిని సచివాలయ ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు. వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పరిశీలించారు. మరికొన్ని నమూనాలను తెప్పించాలని ఆదేశించారు. సచివాలయ ప్రహరీ కోసం రెయిలింగ్ నమూనాను కూడా సీఎం పరిశీలించారు. పాత రెయిలింగ్‌ను కూడా స్వయంగా పరిశీలించిన ఆయన... ధృఢంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : హరిత భవనంగా నిలువనున్న సచివాలయం!