రాష్ట్రంలో కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలను పరిష్కారం చేయడంలో రాజీ పడవద్దని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రీజియన్ ఈఎస్ఐ బోర్డు సభ్యులుగా నియమితులైన రవిశంకర్ అల్లూరి, వి.మారయ్య, రమణా రెడ్డిలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. బోర్డు సభ్యులుగా ఎన్నికయిన సభ్యులను మంత్రి అభినందించారు. సభ్యులు రవిశంకర్, తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ప్రభుత్వం కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
కొవిడ్ వ్యాప్తి తగ్గిన తరువాత బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని సభ్యులు మంత్రికి విన్నవించారు. రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు వైద్యం సకాలంలో అందటం లేదని ఈఎస్ఐ బోర్డు సభ్యులు, బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ మంత్రికి విన్నవించారు. గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ రోగులకు మందులు అందక అవస్థలు పడుతున్నారని.. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించవలసి ఉందన్నారు. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి కార్మికులకు అందుబాటులో తేవడానికి కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి: జిల్లాలో నాటిన మొక్కలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా...