వైమానిక పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూల ప్రాంతమని, అత్యుత్తమ పారిశ్రామిక విధానం ఇక్కడ అమలులో ఉందని, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. భారత్‌లో సైనిక విమానం తయారీ పరిశ్రమ ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ వైమానిక తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చింది. సంస్థ భారత విభాగాధిపతి రెమి మైలార్డ్, రక్షణ విభాగాధిపతి వెంకట్ కట్కూరి, హెలికాప్టర్ల తయారీ విభాగాధిపతి అశిష్ షరాఫ్‌లు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, వైమానిక సంచాలకుడు ప్రవీణ్‌లు పాల్గొన్నారు.
రక్షణ రంగ ఉత్పత్తులకు కేంద్రం
భారత ప్రభుత్వానికి సైనిక విమానాల పంపిణీ ఒప్పందం చేసుకున్న ఎయిర్‌బస్ దీనికి సంబంధించిన పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. గురువారం బెంగళూరులో పర్యటించిన ఆ బృందం శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చింది. తమ ప్రణాళికల గురించి మంత్రితో చర్చించింది. ఈ సందర్భంగా ప్రతినిధి బృందానికి కేటీఆర్ తెలంగాణలో అనుకూలతల గురించి దృశ్య రూపకంగా వివరించారు. దేశంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని... పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామని కేటీఆర్ పేర్కొన్నారు. భౌగోళికంగా ఉన్న పరిస్థితులకు తోడు ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. వైమానిక రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలున్నాయని... ప్రపంచంలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు జరుగుతున్న ప్రాంతమిదని వివరించారు.
ఎన్నో ఆకర్షణలు
సరళతర వాణిజ్య నిర్వహణతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. టీఎస్‌ఐపాస్ ద్వారా కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నాం. అయిదేళ్లలో 14 వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులిచ్చాం. అమెజాన్ వంటి పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చాయి. రాష్ట్రంలో బలమైన, బాగా స్థిరపడిన రక్షణ పర్యావరణ వ్యవస్థ ఉంది. భారత రక్షణ రంగానికి చెందిన 12 ప్రధాన సంస్థలు ఇక్కడున్నాయి. డీఆర్‌డీవో చక్కటి సేవలందిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాప్టర్‌తో పాటు ఎఫ్-16 యుద్ధ విమానం విడిభాగాలు ఇక్కడే తయారవుతున్నాయి. 25 బహుళ జాతి వైమానిక సంస్థలు ఇక్కడ పరిశ్రమలు నిర్వహిస్తున్నాయి. జీఈ, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, సికోర్క్సీ, రాఫెల్ ఇప్పటికే రాగా, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
టీహబ్ భారత్‌లోనే అతిపెద్ద అంకుర కేంద్రం
విమానాల లీప్ ఇంజిన్లు, ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలు, అపాచీ హెలికాప్టర్ల విడిభాగాలు, అదానీ ఎల్బిట్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా డ్రోన్ల తయారీ, సీ-130జే సూపర్ హెర్క్యులస్ ఎయిర్ లిఫ్టర్, ఎస్-92 హెలికాప్టర్ల ఉత్పత్తి సాగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. క్షిపణుల సాంకేతిక నైపుణ్యానికి తెలంగాణ మారుపేరుగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఉన్న టాటా సెజ్ వంటి నాలుగు ప్రత్యేక వైమానిక ఆర్థిక మండళ్లు, పార్కులకు తోడు కొత్తగా మరో రెండు పార్కులు ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. వైమానిక పరికరాలు తయారు చేసేందుకు నాణ్యమైన ఉన్నత ప్రమాణాలు కలిగిన వెయ్యికి పైగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు నడుస్తున్నాయని... నైపుణ్యం గల మానవ వనరుల కోసం టాస్క్ ద్వారా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని వివరించారు. టీహబ్ భారత్‌లోనే అతిపెద్ద అంకుర కేంద్రమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అంకురాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కొత్త పరిశ్రమలకు సాంకేతిక సహకారం అందిస్తున్నామని... త్వరలోనే ఇక్కడ ప్రపంచ స్థాయి రక్షణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నామని కేటీఆర్ వివరించారు.
త్వరలో మళ్లీ పర్యటన
మరికొన్ని రాష్ట్రాల్లో పర్యటించి.. సమాచారం సేకరిస్తామని ఎయిర్‌బస్ ప్రతినిధి రెమి మైలార్డ్ చెప్పారు. వచ్చేనెల మొదటి వారంలో మళ్లీ రాష్ట్రానికి వచ్చి స్థల పరిశీలన చేపట్టడంతో పాటు ప్రభుత్వంతో సమావేశమవుతామని తెలిపారు.
ఇదీ చదవండి : అమిత్‌షాతో కేసీఆర్ ఏకాంత చర్చ... నేడు ప్రధాని మోదీతో భేటీ