Telangana HC News : కోర్టు ఉత్తర్వుల అమల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లిన ఆ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కోర్టు ఉద్యోగులపై కేసు పెట్టడాన్ని హైకోర్టు గురువారం ప్రశ్నించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరి 5న నమోదైన కేసు దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలిస్తూ విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతి ఈ నెల 10న రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకుంది.
TS HC Notice to Govt: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భూసేకరణ పరిహారం పెంపుపై దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా జడ్జి 2012లో ఉత్తర్వులిచ్చారు. 2015 వరకు పట్టించుకోకపోవడంతో పిటిషనర్ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో జేడీఆర్/స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలోని చరాస్తుల జప్తునకు గత ఏడాది అక్టోబరులో కోర్టు ఆదేశాలిచ్చింది.
ఈ ఉత్తర్వుల అమలుకు న్యాయవాది గణపతి, ఇద్దరు కోర్టు ఉద్యోగులు జనవరి 4న కలెక్టరేట్‌కు వెళ్లారు. అదనపు కలెక్టర్ సమావేశంలో ఉన్నారని చెప్పగా..రెండు గంటలకుపైగా వేచిచూశారు. జప్తు ఆదేశాలకు సంబంధించి డిప్యూటీ తహసీల్దార్‌తో సంతకం తీసుకున్నారు. రెండ్రోజుల తరువాత కోర్టు ఆదేశించిన మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి అంగీకరించినా తరువాత పట్టించుకోలేదు.
5న నిజామాబాద్ జిల్లా కోర్టు సమావేశ మందిరంలో జరిగిన చర్చలో.. ఈ భూసేకరణ ఉత్తర్వుల ప్రామాణికతను ప్రశ్నిస్తూ అదనపు కలెక్టర్ మాట్లాడగా న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ ప్రోద్బలంతో న్యాయవాదిగా ఉన్న తనతో పాటు కోర్టు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారని గణపతి తన లేఖలో పేర్కొన్నారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. కేసు దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి: