రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ఇన్ఛార్జి వీసీలు, రిజిస్ట్రార్లతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్, వాట్సప్ గ్రూప్, యాప్ల ద్వారా విద్యా బోధన కొనసాగించే అవకాశాలను పరిశీలించాలని యూనివర్సిటీల అధికారులకు గవర్నర్ సూచించారు.
విద్యార్థులు, అధ్యాపకులపై కరోనా ప్రభావం మరింత పడకుండా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ప్రజల్లో చైతన్యం కలిగించడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ దిశా నిర్దేశం చేశారు. కోవిడ్-19పై పరిశోధనలను యూనివర్సిటీలు ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సరైన పాత్ర పోషించడం లేదని గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కాన్ఫరెన్స్లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.