Telangana Governor Twitter Account Hacked : ఎంతో కాలంగా ఎందరో సెలబ్రిటీలు, రాజకీయ నేతలు హ్యాకింగ్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా హ్యాకింగ్ బాధితురాలయ్యారు. ఆమె ఎక్స్ (ట్విటర్) అకౌంట్ హ్యాక్‌కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి పాస్ వర్డ్ మార్చినట్లు సమాచారం. కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించారంటూ ఎక్స్ కంపెనీ నుంచి గవర్నర్‌కు ఓ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
Telangana Governor X Account Hack : గవర్నర్ తన అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా, పాస్ వర్డ్ తప్పంటూ జవాబు వచ్చినట్లు రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. అందులో పోస్టులను పరిశీలించిన తమిళిసై, తనకు సంబంధంలేని పోస్టులు పెట్టినట్లు గుర్తించారని వెల్లడించారు. ఈ విషయంపై రాజ్‌భవన్ సిబ్బందిని ఆరా తీసినట్లు చెప్పారు. చివరకు తన అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనట్లు గమనించిన గవర్నర్ తమిళిసై దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గవర్నర్ ఆదేశాలతో రాజ్‌భవన్ అధికారులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. గవర్నర్ ఎక్స్ అకౌంట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాఫ్తు చేపట్టినట్లు తెలిసింది.
Minister Damodara Rajanarsimha Facebook Account Hacked : ఇటీవలే రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్బుక్ ఖాతా కూడా హ్యాక్‌కు గురైన విషయం విధితమే. మంత్రి ఖాతాను తమ కంట్రోల్లోకి తీసుకున్న సైబర్ కేటుగాళ్లు, అందులో బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీల ఫొటోలను వందల సంఖ్యలో పోస్టు చేశారు. అనుచరులు అలర్ట్ చేయడంతో స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్‌కు గురైందని, అందులో పెట్టిన పోస్తులకు ఎవరూ స్పందించవద్దని కార్యకర్తలు, నేతలకు సూచించారు. ఈ మేరకు హ్యాకింగ్ ఘటనపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ అకౌంట్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి.
Celebrities Accounts Hack : ఇటీవల ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురవ్వడం సాధారణమైపోయింది. కేవలం వారి ఖాతాలే కాదు. కొన్నిసార్లు బ్యాంకు సర్వర్లు కూడా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. గతంలో మహేశ్ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు ఏకంగా రూ.12 కోట్లను కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హ్యాకింగ్‌కు గురి కాకుండా ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను పటిష్ఠంగా సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.