government opposed by the Tungabhadra Board: బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు భిన్నంగా తుంగభద్ర బోర్డు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. కృష్ణా జల వివాదాల మొదటి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం కేసీ కెనాల్‌కు తుంగభద్ర నీటిని మాత్రమే వినియోగించుకోవాలని.. అది కూడా అవార్డులో నిర్ధేశించిన పరిమితులకు లోబడి మాత్రమే ఉండాలని లేఖలో పేర్కొన్నారు.
కానీ ట్రైబ్యునల్ అవార్డును అతిక్రమించి కేసీ కెనాల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర నీటికి బదులుగా శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను మళ్లిస్తోందని, తరలింపు కూడా అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టుల ద్వారా జరుగుతోందని అన్నారు. దీంతో తుంగభద్ర నీటిని డ్యామ్ నుంచి కుడి వైపు హై లెవెల్ కెనాల్ ద్వారా మళ్లించాలన్న ఏపీ విజ్ఞప్తిపై మెజార్టీ పేరిట బోర్డు సానుకూల నిర్ణయం తీసుకొందని లేఖలో పేర్కొన్నారు.
ఈ నిర్ణయం బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు వ్యతిరేకమని.. దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ అవార్డుకు భిన్నంగా జరిగే మళ్లింపులను వెంటనే ఆపాలని కోరింది. తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి ప్రాజెక్టులకు ట్రైబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా డ్యామ్ ఖర్చును ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఆర్‌డీఎస్‌లో తెలంగాణ వాటా కేటాయింపుల ఆధారంగా చేయాలని తాము కోరుతున్నట్లు పేర్కొంది. కానీ, అందుకు భిన్నంగా ఎక్కువ శాతం తెలంగాణ భరించాలన్న మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారం బోర్డు నిర్ణయం తీసుకోవడం తగదని ఆక్షేపించింది. రెండు నిర్ణయాలను వెంటనే సవరించాలని తుంగభద్ర బోర్డుకు విజ్ఞప్తి చేసింది.
ఇవీ చదవండి: