డీజీపీతో పాటు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసి వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని డీజీపీ కార్యాలయం (DGP Office) పేర్కొంది. ఆ వ్యాఖ్యలు పోలీస్ శాఖ పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని వెల్లడించింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారమే పోలీస్ శాఖ నడుచుకుంటోందని... శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ కార్యాలయం తెలిపింది.
పోలీస్ శాఖలో విభేదాలున్నాయనడం ఏమాత్రం నిజం కాదని... ఉన్నతాధికారులందరూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని డీజీపీ కార్యాలయం (DGP Office) స్పష్టం చేసింది. ప్రతిభా సామర్థ్యాల ఆధారంగానే అధికారులకు పోస్టింగులు ఇస్తారంది. మావోయిస్టులు సామాన్య ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రాణాలు బలి తీసుకున్నారని, మావోయిస్టులను అణిచివేసేందుకు 350 మందికి పైగా పోలీసులు ప్రాణత్యాగం చేశారని డీజీపీ కార్యాలయం తెలిపింది. మావోయిస్టులుంటే బాగుండేది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం... పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని.. దీనివల్ల సమాజంలో శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముందని అభిప్రాయపడింది.
ఫోన్ ట్యాప్...
రాష్ట్ర పోలీసు విభాగం రెండు భాగాలుగా విడిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని పేర్కొన్నారు. నర్సింగరావు డీజీపీపై.. వేణుగోపాల్‌రావు తమపై నిఘా పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవీణ్‌కుమార్ వేరే పార్టీలో చేరారని.. ఆయన సామాజికవర్గ అధికారులను వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఆత్మత్యాగాలెవరు చేశారని రేవంత్ ప్రశ్నించారు. త్వరలో తెరాసలో ముసలం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ఇదీ చూడండి: Revanth Reddy on Trs Plenary: 'తెలుగుతల్లిని దూషించిన కేసీఆర్... ప్లీనరీలో విగ్రహం పెట్టుకున్నడు'