KCR Delhi Tour Ends: ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల దిల్లీ పర్యటనను (CM KCR Delhi Tour) ముగించుకొని బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం దిల్లీకి వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సోమ, మంగళవారాల్లో కలిసేందుకు సీఎం కార్యాలయం అనుమతి కోరినా లభించలేదని తెలిసింది. బుధవారం ప్రధానితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ ఉండటంతో కేసీఆర్‌కి అవకాశం లభించలేదని సమాచారం.
రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌లతో మంగళవారం సాయంత్రం భేటీ అయింది. ఈ సందర్భంగా ధాన్యం సేకరణపై వారు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ నెల 26న మరోసారి రావాలని కేంద్ర మంత్రులు సూచించారు. మరోవైపు ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాల దృష్ట్యా మరికొన్ని రోజులు ప్రధానితో భేటీకి అవకాశం లేదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దిల్లీ నుంచి తిరిగివచ్చారు. మంత్రులు ఈ నెల 26న మళ్లీ దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. అనంతరం సీఎం కేసీఆర్ తదుపరి కార్యాచరణను ప్రకటించే వీలున్నట్లు తెలిసింది.
దిల్లీ పర్యటన ఇలా సాగింది..
యాసంగి ధాన్యం కొనుగోళ్ల(paddy procurement in Telangana)పై కేంద్రం నుంచి స్పష్టత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ(CM KCR Delhi Tour) వేదికగా కార్యచరణ ముమ్మరం చేశారు. యాసంగిలో ఎంత మేర వడ్లు కొంటారో తేల్చడంతో పాటు.. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, కృష్ణా, గోదావరి జలాల్లో(krishna godavari water dispute) రాష్ట్ర వాటాను పక్కాగా కేటాయించాలన్న అంశాన్ని దిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించేందుకు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి కేసీఆర్ దిల్లీ (CM KCR Delhi Tour) వెళ్లారు.
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రానికి చెందిన మంత్రులు (ts ministers met union ministers) కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, పలువురు ఎంపీలు.. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్‌తో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణపై చర్చించారు. కొన్ని విజ్ఞప్తులపై కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఏడాది మొత్తం మీద రెండు సీజన్లలో 100 నుంచి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రుల బృందం కోరింది. అలా కాకుండా.. ఏ సీజన్‌లో ఎంత ఉత్పత్తి ఉంటుందో చెప్పాలని కేంద్రమంత్రులు అడిగినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు కొన్ని విషయాలపైనే సానుకూలంగా స్పందించారని.. కొన్నింటిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదని తెలిసింది.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా తేల్చాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. గిరిజన రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ.. కేంద్రం తేల్చడం లేదని ఆగ్రహంగా ఉన్న కేసీఆర్ ఆ అంశాన్ని కూడా ప్రస్తావించనున్నారు. కేంద్రం తేల్చకపోతే గిరిజన పోరాటాలు చేస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చాలా కాలంగా ఉందని.. దానిపై కేంద్రం ఏదో ఒకటి తేలిస్తే.. ఏం చేయాలో నిర్ణయించుకుంటామన్న ముఖ్యమంత్రి.. దానిపై కూడా స్పష్టత కోరనున్నారు.
ఇదీ చూడండి: KCR delhi tour: హస్తిన చేరుకున్న కేసీఆర్ బృందం.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం