కరోనా నేపథ్యంలో రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేసిన రేషన్ డీలర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కిలో బియ్యానికి రూ.0.70 పైసల చొప్పున కమిషన్ చెల్లిస్తున్నామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూన్, జులై నెలల్లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి చౌక ధరల దుకాణాల డీలర్లకు రూ. 54.78 కోట్ల కమిషన్ను రెండు విడతల్లో చెల్లించనున్నామని ఆయన హైదరాబాద్లో ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ చెల్లింపులు సంబంధించి పూర్తిగా పారదర్శకత ఉండేలా ఈ కమిషన్ ఆన్‌లైన్ విధానం ద్వారా చౌక ధరల దుకాణాల డీలర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏప్రిల్ నుంచి జులై వరకు దాదాపు రూ. 22 కోట్ల కమిషన్ రావాల్సి ఉండగా డీలర్ల కమిషన్ వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి కమిషన్ రాకపోయినా.. సీఎం ఆదేశాల మేరకు రేషన్ డీలర్లకు పూర్తిస్థాయి కమీషన్ చెల్లిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడులు రానున్నందున.. అందుకు అనుగుణంగా కొనుగోలు చేయడానికి పౌరసరఫరాల సంస్థకు పెద్ద ఎత్తున గన్నీ సంచులు అవసరమవుతాయన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని బియ్యం పంపిణీ చేసిన తర్వాత మిగిలినపోయి గన్నీ సంచులు రేషన్ డీలర్లు తప్పనిసరిగా పౌరసరఫరాల సంస్థకే విక్రయించాలని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఒక గన్నీ సంచి ధర 16 రూపాయలు ఉండగా... డీలర్ల విజ్ఞప్తి మేరకు గడిచిన యాసంగి సీజన్లో 18 రూపాయలకు పెంచామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'