రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. వైద్యాధికారులు రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమావేశంలో వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకిన కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టిందని... హైదరాబాద్‌లోనూ కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగా నమోదవుతున్నందున ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ప్రజలు పెద్దగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్న కేబినెట్... ఎన్ని కొవిడ్ కేసులు వచ్చినా వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని... ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వసతులు, మందులు, నిపుణులైన వైద్యులను ఉపయోగించుకోవాలని ప్రజలను కోరింది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చైనా వెనకాడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
అవకతవకలకు పాల్పడే ఆస్పత్రులపై కఠిన చర్యలు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమిడెసివిర్, లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లను లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్... ఇందుకోసం పదిలక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్‌ను సిద్ధంగా ఉంచాలని తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా పదివేల ఆక్సిజన్ పడకలను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. కొవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కరోనా చికిత్స కోసం ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం... వైద్య,ఆరోగ్య శాఖ నిధులను నెల వారీగా ఖచ్చితంగా విడుదల చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.
ప్రతి రోజూ 40 వేలు పరీక్షలు నిర్వహించాలి
ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉచితంగా కరోనా రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన ఔషధాలు, భోజనాల ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. ప్రతి రోజూ 40వేల వరకు కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్ ఇవాళ కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించి, జిల్లాల్లో అవసరాలు తెలుసుకొని అవసరమైన నిర్ణయాలు తీసుకొంటారు.
ఇవీ చూడండి: తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు