TS State Cabinet Meeting : ప్రగతిభవన్లో ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ దాదాపు 5 గంటలపాటు కొనసాగింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ మినహా మిగతావారు ఈ సమావేశానికి హాజరయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్నందున కొప్పుల ఈశ్వర్ భేటీకి హాజరుకాలేకపోయారు. ఈ మంత్రి వర్గ భేటీలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలపై చర్చించారు.
అందులో ప్రధానంగా ఇళ్లస్థలాలు, ఇళ్లకు సంబంధించి.. పేదలకు పట్టాల పంపిణీ, సొంతస్థలాలున్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు 3లక్షల ఆర్థికసాయంపై కేబినెట్‌లో చర్చసాగింది. ఈ పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇద్దరు నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను మంత్రిమండలిలో చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, ఇతర రాజకీయ అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే 58, 59 జీవో ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియపైనా ఈ భేటీలో చర్చసాగింది. క్రమబద్దీకరణకి దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశమివ్వాలన్న ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులపై సమావేశంలో చర్చకొచ్చే అవకాశముంది. గ్రామకంఠం సహా ఇతరత్రా ఇళ్ల స్థలాలు పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. పోడు పట్టాల అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరి, రాష్ట్రప్రభుత్వంగా అమలు చేయాల్సిన కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఉప్పుడుబియ్యం తీసుకోబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసినందున కొనుగోళ్లపై ఏం చేయాలన్న అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దళితబంధు పథకం అమలుపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు చెందిన కొన్ని పనుల అంచనా వ్యయాలపై చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కొత్త విధానం తేచ్చేందుకు కొన్నేళ్లుగా మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. ఆ ముసాయిదా విధానంపై చర్చించే అవకాశం ఉంది.
కవితకు ఈడీ నోటీసుల అంశంపై ప్రస్తావన : భూముల అమ్మకం, ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవడం... నిధుల సమీకరణపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయాల్సిన ఇద్దరి పేర్లను కేబినెట్ ఖరారుచేయనుంది. శాసనసభ కోటాలో ఖరారు చేసిన... ముగ్గురు అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవితకు... ఈడీ నోటీసుల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇతర పాలనా, రాజకీయ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఏడాది నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్ళడం, పార్టీ కార్యాచరణ తదితర అంశాలపై మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: