Telangana Cabinet Meeting Started at Secretariat : సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 5 గంటల పాటు చర్చించారు. కేబినెట్ భేటీలో దాదాపు 50 అంశాలపై చర్చ జరిగింది. భారీ వర్షాలు, వరదల పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై కేబినేట్ సమీక్షించింది. అకాల వర్షాలతో వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ విధానాలపై మంత్రివర్గం చర్చలు జరిపింది. ఉద్ధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై చర్చించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గంలో చర్చించారు. రైతులకు జరిగిన నష్టం, దెబ్బతిన్న రహదార్లకు సంబంధించి సిద్ధం చేసిన నివేదికను అధికారులు మంత్రివర్గం ముందు ఉంచారు. పురపాలక శాఖకు సంబంధించిన పలు అంశాలూ చర్చకు వచ్చాయి.
మంత్రివర్గ సమావేశంలో ఆ అంశాలపై చర్చ : ఈ భేటీలో కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీల ఏర్పాటు ప్రతిపాదనలు, అనాథ చిన్నారుల కోసం విధానం రూపకల్పన అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. రూ.5 వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు ట్రాన్స్‌కోకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చే అంశం కూడా ఉండవచ్చని తెలిసింది. గవర్నర్ వెనక్కి పంపిన నాలుగు బిల్లులపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. 2022 పురపాలక నిబంధనలు, డీఎంఈ పదవీ విరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన, పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుల విషయంలో తదుపరి కార్యాచరణ విషయమై చర్చించనున్నారు. తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లును తొలగించడం, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లుల ముసాయిదాపై మంత్రివర్గం చర్చించనుంది. బిల్లులను ఆమోదిస్తే గురువారం ప్రారంభమయ్యే శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రవేశపెడతారు.
ఆ అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్ : వీఆర్ఏల క్రమబద్దీకరణ, సర్దుబాటుపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ, గృహలక్ష్మి, బీసీలు, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం, దళితబంధు సహా కీలకమైన పథకాల అమలు, పురోగతి, తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చ జరగనుంది. ఆర్థిక పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పరంగా పూర్తి చేయాల్సిన పనుల విషయంపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గురువారం ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల విషయమై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. సమావేశాల ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అంశాలు, విపక్షాలను ఎదుర్కోవడం, ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లుల ముసాయిదాపై కేబినేట్ చర్చించి ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవీ చదవండి :