రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అన్నింటా సమప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరోనా నిర్మూలనకు సమష్టిగా కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఇతర సమస్యల దృష్ట్యా అన్నదాతల కష్టాలను దూరం చేసేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. గురువారం మంత్రిమండలి సమావేశం అనంతరం ఆయన మంత్రులతో అభివృద్ధి, రాజకీయ అంశాలపై మాట్లాడారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం..
‘‘తెలంగాణ అన్నివర్గాల సమాహారం. అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ప్రతి ఇంట్లో పథకాల లబ్ధిదారులు ఉండటమే మన విజయానికి నిదర్శనం. మరిన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చే అన్నింటా దళితులకు రిజర్వేషన్ ప్రకటించాం. ఇప్పుడు మద్యం దుకాణాల్లో గీత కార్మికులతో పాటు దళితులు, గిరిజనులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాం. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు మంత్రులు కృషి చేయాలి.
అన్నదాతలకు సంపూర్ణ భరోసా..
దేశంలో ఎక్కడాలేని విధంగా అన్నదాతలను కంటికి రెప్పలా కాపాడుతున్నాం. ఇప్పుడు బియ్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి సమస్యగా మారుతోంది. మద్దతు ధరలపైనా న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో రైతులను ముందే అప్రమత్తం చేయాలి. వారి పెట్టుబడులకు తగిన గిట్టుబాటు దక్కితేనే న్యాయం జరిగినట్లుగా భావించాలి. ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉంది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను అన్వేషించాలి. వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది.
వైద్య ఆరోగ్య రంగం అభివృద్ధి..
రాష్ట్రంలో కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాం. వందశాతం అర్హులకు టీకాలు వేస్తే మన సంకల్పం నెరవేరినట్లే. దీనికి మంత్రులు బాధ్యత తీసుకోవాలి. వైద్యఆరోగ్య రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. వైద్యసిబ్బంది నియామకాలు త్వరలో చేపడతాం. జిల్లాకో వైద్య కళాశాలను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాం. శాసనసభ సమావేశాల్లో విపక్షాలను దీటుగా ఎదుర్కొందాం. ప్రతిపక్షాలు రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిందే’’ అని సీఎం అన్నారు. హుజూరాబాద్‌లో తెరాస భారీ మెజారిటీతో గెలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశానికి ఆదేశాలు..
కొత్త నియామకాల నోటిఫికేషన్‌పై చర్చ జరిగినా దానిపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఇతర జోన్‌లలో ఉన్నవారిని సొంత జోన్లకు పంపడంపై స్పష్టత రాలేదు. నేరుగా బదిలీలు, ఐచ్ఛికాల అవకాశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం సీఎస్ సోమేశ్‌కుమార్‌కు సూచించినట్లు సమాచారం.
సీఎంకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు
మద్యం దుకాణాల్లో వచ్చే ఏడాది నుంచి గౌడ కులస్థులకు 15 శాతం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు.. ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. గీత కార్మిక కుటుంబాలు ఆయనకు రుణపడి ఉంటారన్నారు. దళిత బహుజనులకు ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. నాటి సర్వాయి పాపన్న ఆశయాలను సీఎం సాధిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించాలని శ్రీనివాస్‌గౌడ్ రాగా... ప్రతిగా కేసీఆర్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ‘‘కల్లుగీత వృత్తి గౌడకులంలో పుట్టిన బిడ్డవు.. నీకే నేను సన్మానం చేయాలి’’ అంటూ శ్రీనివాస్ గౌడ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.
KTR: ఐటీలో దేశంలోనే తెలంగాణది ఫస్ట్ ప్లేస్... త్వరలోనే టీ వర్క్స్