వర్షాకాల సమావేశాల్లో నేటి నుంచి పూర్తి స్థాయి అజెండాపై చర్చ జరగనుంది. ఇవాళ్టి నుంచి ఉభయసభల్లో (ts monsoon assembly session) ప్రశ్నోత్తరాలనూ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు పనులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు, ఉస్మానియా ఆస్పత్రిలో జంట టవర్ల నిర్మాణం, గొర్రెల యూనిట్ల పంపిణీ, రాష్ట్రంలో జనపనార మిల్లుల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అంశాలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగం పురోగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీఏసీ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉభయసభల ముందు ఉంచుతారు. గృహనిర్మాణ సంస్థ, ఉద్యానవన విశ్వవిద్యాలయం, పంచాయతీరాజ్, నల్సార్ చట్ట సవరణల బిల్లులను మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నివేదికను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కొన్ని జిల్లాల్లో గ్రామపంచాయతీల మార్పులు, చేర్పుల ముసాయిదాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉభయ సభల ముందు ఉంచనున్నారు. శాసనమండలిలో ఇవాళ కేవలం ప్రశ్నోత్తరాలు మాత్రమే చేపడతారు. వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి, రాష్ట్రంలో వరిసాగు- దిగుబడి, ఎయిడెడ్ కళాశాలల్లో కారుణ్య నియామకాలు, కొత్త కారాగారాల నిర్మాణం, స్థానికసంస్థలకు తలసరి గ్రాంటు, ఉర్దూ మాధ్యమంలో అంగన్ వాడీ కేంద్రాలకు సంబంధించిన అంశాలు కౌన్సిల్ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.
బీఏసీ భేటీ సందర్భంగా కేసీఆర్ ఏమన్నారంటే..
కొత్త రాష్ట్రమైనప్పటికీ సమావేశాల నిర్వహణలో తెలంగాణ శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్తగా మరికొన్ని నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసనసభ కుస్తీ పోటీలకు వేదిక కారాదని... అర్థవంతమైన చర్చ జరగాలన్నారు.
ప్రోటోకాల్ పాటించాల్సిందే...
ఎమ్మెల్యేల కోసం హైదరాబాద్‌లో క్లబ్ నిర్మించాలన్న అంశం బీఏసీలో చర్చకు వచ్చింది. దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ తరహాలో క్లబ్ నిర్మాణం జరగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఇందుకోసం మంత్రులు, శాసనసభాపక్ష నేతలతో కలిసి దిల్లీ వెళ్లి రావాలని సభాపతి పోచారంను కోరారు. శాసనసభ్యుల ప్రోటోకాల్ అంశాన్ని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రస్తావించారు. చాలా సందర్భాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ప్రోటోకాల్ సమస్య ఎప్పట్నుంచో ఉందని.. సభ్యుల గౌరవానికి ఎక్కడా భంగం కలగరాదన్న సీఎం కేసీఆర్... అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. అటు శాసనసభ కార్యదర్శి హోదా పెంచాల్సిన అవసరం ఉందని... పార్లమెంట్ కార్యదర్శికి కేబినెట్ సెక్రటరీ హోదా ఉన్నట్లే ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. బిల్లులకు సంబంధించి సభ్యులకు ముందే సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ అన్నారు.
మిగతా రాష్ట్రాలలో పోలిస్తే... మనమే భేష్..
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ శాసనసభ సమావేశాలు బాగా జరుగుతున్నాయని... ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను సభ ద్వారా చెప్పుకోవాలని... సమావేశాలు ఎన్ని రోజులైనా ఇబ్బంది లేదని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిపారు.
ఇదీచూడండి: ts assembly session: అక్టోబర్ 5వరకు అసెంబ్లీ సమావేశాలు.. ప్రోటోకాల్‌పై స్పష్టమైన ఆదేశాలు..!