Telangana Assembly Monsoon Sessions 2023 Ended : 4 రోజుల పాటు సాగిన శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. 26 గంటల 45 నిమిషాల పాటు సభ జరగగా.. 4 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. గవర్నర్ వెనక్కి పంపిన 4 బిల్లులను పునః పరిశీలించిన అసెంబ్లీ.. మొత్తంగా 8 బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీకి నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగనుండగా.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో సభకు ప్రస్తుత సమావేశాలే చివరివి కానున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రస్తుత సభ మళ్లీ భేటీ అయ్యే అవకాశం లేదు.
Telangana Assembly Sessions 2023 : రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన రెండో శాసనసభ ఇది. 2018 ఎన్నికల అనంతరం 2019 జనవరి 17న ప్రస్తుత సభ కొలువు తీరింది. ఇప్పటి వరకు సభ 73 రోజులు పాటు సమావేశం కాగా.. కరోనా మహమ్మారితో పాటు ఇతర కారణాల వల్ల ఎక్కువ రోజులు సమావేశాలు జరగలేదు. 409 గంటల పాటు జరిగిన సమావేశాల్లో 70 బిల్లులను ఆమోదించారు. మరో 4 బిల్లులను పునః పరిశీలించారు. ఒకసారి ఆమోదించిన బిల్లులు వెనక్కు రావడంతో మళ్లీ ఆమోదించి పంపడం ఇటీవలి కాలంలో ఇదే మొదటి సందర్భం. ప్రొరోగ్ కాకుండా ఒకే సిట్టింగ్ ఎక్కువ రోజుల పాటు జరగడమూ ఇదే ప్రథమం.
Bills Passed in Telangana Assembly Session 2023 : 2021 సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమైన ఎనిమిదో సిట్టింగ్ ఇప్పటి వరకు ప్రొరోగ్ కాలేదు. 21 నెలలకుపైగా శాసనసభ ప్రొరోగ్ కాలేదు. ఎనిమిదో సిట్టింగ్‌లో భాగంగానే ఇప్పటి వరకు ఐదు సమావేశాలను నిర్వహించారు. ఫిబ్రవరిలో జరిగిన సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించినప్పటికీ ఆ సమావేశాలను సైతం అంతకుముందు సిట్టింగ్‌లో భాగంగానే నిర్వహించారు.
Legislative Assembly approves TSRTC Bill : ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం
శాసన సభ, మండలి వర్షాకాల సమావేశాలు హుందాగా, సజావుగా సాగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ 26 గంటల 45 నిమిషాలు పాటు, మండలి 23 గంటల 10 నిమిషాల పాటు సమావేశమయ్యాయని ఆయన చెప్పారు. చరిత్రాత్మక ఆర్టీసీ విలీన బిల్లుతో కేబినెట్ నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్టయ్యిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే అవకాశం లభించిందన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. వర్షాలు, వరదల పరిస్థితిపై ఉభయ సభలు క్షుణ్నంగా చర్చించాయని వెల్లడించారు.
శాసనసభ, మండలి 4 రోజుల పాటు హుందాగా, సజావుగా సాగాయి. శాసనసభ 26 గంటల 45 నిమిషాల పాటు, మండలి 23 గంటల 10 నిమిషాల పాటు సమావేశమయ్యాయి. ఎప్పటి మాదిరిగానే ఈ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కూడా సాఫీగా, ప్రశాంతంగా ముగిశాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతో ఉన్నతంగా.. అర్థవంతంగా ఉభయ సభల్లో చర్చలు జరిగాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా ఉభయ సభలు జరగడం సంతోషంగా ఉంది. చరిత్రాత్మక ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించుకోవడంతో మేం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేసినట్టయ్యింది. - వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి