తెలంగాణ వర్షాకాల శాసనపరిషత్తు, శాసనసభ సమావేశాలు వచ్చే నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉభయసభలను సమావేశపరుస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న సమావేశాలుగా చెప్పుకోవచ్చు. సమావేశాల నిర్వహణకు సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భౌతిక దూరం ఉండేలా
అందుకు సంబంధించి సభాపతి, మంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సభలో సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఉన్న 76 సీట్లకు అదనంగా మరో 42 ఏర్పాటు చేస్తున్నారు. అటు శాసనసభ, మండలి ప్రవేశ మార్గాల వద్ద అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేశారు. వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను ఆటోమేటిక్గా గుర్తించేలా ఈ స్కానర్లు పనిచేయనున్నాయి. శానిటైజర్లు, వేడినీరు అందుబాటులో ఉంచడంతోపాటు కషాయాన్ని కూడా ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించేలా చూడనున్నారు. సమావేశ మందిరానికి పూర్తిగా సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యం ఉన్న దృష్ట్యా సభ్యులు ఇబ్బంది పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడం సహా ఇతర చర్యలు తీసుకోనున్నారు.
తక్కువ సిబ్బంది
సందర్శకుల ప్రవేశాలను పూర్తిగా నిలిపివేయడంతోపాటు సిబ్బంది కూడా తక్కువ సంఖ్యలోనే విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు శాసనసభ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు శాసనసభ్యులతో సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి వారితో చర్చించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని ఎమ్మెల్యేలు అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై సభా వేదికగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : ఘటనా స్థలానికి ఎందుకు వెళ్లనివ్వడం లేదు: రాజాసింగ్