వివిధ సందర్భాల్లో నిందితులకు పూచీకత్తు ఇచ్చే వారి బాధ్యతను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. న్యాయాధీశుల సమావేశంలో వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా, ఉన్నత న్యాయస్థానం సూచన మేరకు సీఆర్పీసీ చట్టానికి సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.
పెరుగుతున్న దాడులు...
బిల్లును సమర్థించిన కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క... రాష్ట్రంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో చిన్నారిపై ఆకృత్యానికి పాల్పడ్డారని, కుటుంబానికి ఆర్థికసాయం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అవకతవకలకు ఆజ్యం...
భూముల క్రయవిక్రయాల సందర్భంలో విలువ నిర్ధరణ విషయంలో ఉన్న విచక్షణాధికారాలు అవకతవలకు ఆజ్యం పోస్తున్నాయన్న ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం... స్టాంపుల చట్టంలోని 47ఏ సెక్షన్‌కు సవరణలు చేసింది. సంబంధిత బిల్లును ముఖ్యమంత్రి తరఫున శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. తద్వారా అవకతవకలను అరికట్టి రిజిస్ట్రేషన్ బాధల నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు.
తీవ్రంగా ఎల్ఆర్ఎస్ సమస్య...
బిల్లును సమర్థించిన సీఎల్పీ నేత భట్టి... ఎల్ఆర్ఎస్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిలిపివేసిన రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయని మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో పేదలకు వీలైనంత తక్కువ భారంతో క్రమబద్ధీకరణ చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ భావన అన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి... ఈనెల 25న ధరణి ప్రారంభమవుతున్న తరుణంలో వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయన్నారు.
3నెలల పాటు మినహాయింపు...
వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చే బదలాయింపు ప్రక్రియలోనూ అధికారులకు ఉన్న విచక్షణాధికారాల వల్ల ప్రక్రియ జాప్యంతో పాటు అవకతవలకు ఆస్కారం కలుగుతోందన్న ప్రభుత్వం... నాలా చట్టానికి సవరణ చేసింది.
ఈ బిల్లును కూడా ముఖ్యమంత్రి తరఫున మంత్రి ప్రశాంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. నాలా బదలాయింపు కోసం కూడా ధరణి ద్వారా స్లాట్ బుకింగ్ విధానంలో తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. బదలాయింపు కాని వెంచర్లకు విధించే 50 శాతం జరిమానాను మూణ్నెళ్ల పాటు మినహాయిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూసంబంధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించిన తెరాస సభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి... అవగాహన లేక నాలా బదలాయింపు చేయకపోవడం వల్ల రైతుబంధు నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రజాప్రతినిధులందరూ వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ఇస్తే ప్రజలు హర్షిస్తారని అభిప్రాయపడ్డారు.
సర్వే చేశాకే...
ధరణిలో సరైన వివరాలు లేకుండా నాలా బదలాయింపు చేస్తే తప్పులు దొర్లుతాయన్న సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క... సమగ్ర సర్వే చేశాకే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము బిల్లును సమర్థించబోమన్నారు.
పెద్దల సభ ఆమోదం కోసం...
కోటి 48 లక్షల ఎకరాలకు సంబంధించిన పూర్తిగా సరైన వివరాలు ధరణిలో ఉన్నాయని, సమగ్ర సర్వేకు ఏడాదికి పైగా సమయం పడుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టసవరణ సహా ఈ మూడు బిల్లులను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. పెద్దలసభ ఆమోదం కోసం నాలుగు బిల్లులను బుధవారం శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం