Telangana Anti Narcotics Bureau Arrests Nigerian Drug Gang : బెంగళూరు కేంద్రంగా మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ప్రధాన సూత్రధారి అగ్‌బో మ్యాక్స్‌వెల్ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. మాఫియా మాదిరిగా దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న నైజీరియన్ల సమాచారాన్ని సేకరించి వారికి సహాయనిధి ఏర్పాటు చేశాడు. వారితో జాతీయ స్థాయిలో డ్రగ్స్ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 12 ఏళ్లుగా మత్తు దందా చేస్తున్న నైజీరియన్ ముఠాను రాష్ట్ర యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు బట్టబయలు చేశారు.
నైజీరియాకు చెందిన అగ్‌బో మ్యాక్స్‌వెల్.. వైద్య వ్యాపార వీసాపై ముంబయి వచ్చాడు. అక్కడ వ్యాపారం లాభసాటిగా లేకపోవటంతో క్వెకు ఒసామా పేరుతో నకిలీ పాస్‌పోర్టు, వీసా సంపాదించాడు. విద్యార్థి వీసాలపై వచ్చిన మరో ఇద్దరు నైజీరియన్లతో కలిసి విద్యార్థులు, యువతే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా ప్రారంభించాడు. మాజీ మిత్రుడి సహకారంతో ఘనాకు చెందిన మహిళ పేరుతో కోయంబత్తూరులో బ్యాంకు ఖాతా తెరిపించినట్లు పోలీసులు తెలిపారు.
Drug Peddlers Arrested In Hyderabad : డ్రగ్స్ కొనుగోలుదారుల నుంచి సదరు అకౌంట్ ద్వారా లావాదేవీలు నిర్వహించేవారు. బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్‌కు చెందిన యువత.. ఈ ముఠా వద్ద మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన 100 గ్రాముల కొకైన్, 300 గ్రాముల ఎండీఎంఏ, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్ల హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు.
Drug Dealing Nigerian Gang Targeting Youth : బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు చెందిన సాయి ఆకాశ్, భానుతేజరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. దాదాపు నెల రోజులు అక్కడే మకాం వేసి డెకాయ్ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. స్మగ్లర్లకు అనుమానం రాకుండా కొనుగోలుదారులుగా మారి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసేందుకు వచ్చిన కింగ్‌పిన్ మ్యాక్స్‌వెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా మిగిలిన వారి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కొయంబత్తూరు బ్యాంకు ఖాతాలోని లావాదేవీల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.
Maxwell Supplying Drugs Based in Bangalore : డ్రగ్స్ రాకెట్ ముఖ్య సూత్రధారి మ్యాక్స్‌వెల‌్ మత్తు సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సీపీ ఆనంద్ తెలిపారు. హెల్ప్ ఫర్ అజ్ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ తయారు చేసి భారత్‌లో ఉన్న నైజీరియన్లందరినీ ఏకతాటిపైకి చేర్చేందుకు ప్రయత్నించినట్లు వివరించారు. వివిధ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న నిందితుల కోసం నైజీరియన్ అసోసియేషన్ ప్రారంభించాడు. వారి కోసం సహాయ నిధి ఏర్పాటు చేసి 2 నెలల్లోనే రూ.8.75 లక్షలు సమీకరించాడు. న్యాయవాదుల ద్వారా తమ వారిని బయటకు తీసుకొచ్చి మత్తు పదార్థాలు రవాణా చేసే ఏజెంట్లుగా తయారు చేసినట్లు సీపీ తెలిపారు. యువతను పక్కదారి పట్టిస్తున్న డ్రగ్స్‌ను కట్టడి చేయడంలో ప్రజల సహకారం ఉండాలని సీపీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: