రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన నిధుల విషయంలో కేంద్రం మోకాలొడ్డింది. రూ. 723 కోట్ల ప్రత్యేక గ్రాంటు, రూ. 171 కోట్ల న్యూట్రిషనల్ గ్రాంటుకు కేంద్రం ఆమోద ముద్ర వేయలేదు. మొత్తం రూ. 894 కోట్ల నిధులు రాష్ట్రానికి రావడం సందేహంగా మారింది. కేంద్ర పన్నుల వాటా, స్థానిక సంస్థలకు అందే నిధులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులు మినహా.... రాష్ట్రానికి ప్రతిపాదించిన మిగులు నిధులపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఆర్థిక సంఘం సిఫారసు చేసినా..
ఆర్థిక సంఘం మధ్యంతర నివేదికపై చేపట్టిన చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటుకు సమర్పించారు. కర్ణాటక, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు... పన్నుల వాటా, రెవెన్యూ లోటు భర్తీనిధి 2019- 20లో వచ్చిన దాని కంటే తక్కువ ఉంది. అందువల్ల వీటికి రూ. 6వేల764కోట్ల ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.
కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని పున: సమీక్షించాలని ఆర్థిక సంఘాన్ని కోరతామని కేంద్రం పేర్కొంది. న్యూట్రిషనల్ గ్రాంట్ కింద రాష్ట్రాలకు రూ. 7వేల735 కోట్లు గ్రాంటు ఇవ్వాలని చేసిన సిఫారసుపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రానికి రూ. 171కోట్లు రావాల్సి ఉంది. పనితీరు ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహకాల్లో భాగంగా... దీనిని పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది.
పరిధికి అతీతంగా అప్పులు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత సంఘటిత నిధి పరిధికి అతీతంగా అప్పులు చేస్తున్న విషయాన్ని ఆర్థిక సంఘం గుర్తించింది. ఇవన్నీ బడ్జెటేతర రుణాల కింద పేరుకుపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బడ్జేతర రుణాలను పూర్తిస్థాయిలో బహిర్గతం చేయాలని సిఫారసు చేసింది.
ఈ రుణాలు గుర్తించి నిర్దిష్ట కాలపరిమితిలోగా తీర్చేయాలని పేర్కొంది. ఎఫ్ఆర్బీఎమ్ చట్టప్రకారం బడ్జెటేతర రుణాలతో కలిపి రాష్ట్ర లోటు, రుణాలు ఎంత ఉన్నాయనేది స్పష్టంగా చెప్పాలని స్పష్టం చేసింది. ఈ సిఫారసును కేంద్రం పక్కన పెట్టింది. తగిన సమయంలో సమీక్షిస్తామని చెప్పింది.
నిధుల్లో దక్కనున్న వాటాలు..
రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు ఒక వెయ్యి 847 కోట్ల నిధులు అందనున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడు వ్యవస్థలకు నిధులు ఇవ్వాలని ఆర్థిక సంఘం ప్రతిపాదించగా కేంద్రం ఆమోదించింది. గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు కూడా నిధుల్లో వాటా దక్కనుంది.
50 శాతం నిధులను బేసిక్ గ్రాంటుగా, మిగిలిన 50శాతం టైడ్ గ్రాంటులుగా నిర్దేశించింది. మూడు వ్యవస్థలకు నిధుల నిష్పత్తిని... రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. 70 నుంచి 85 శాతం గ్రామపంచాయతీలకు, 10 నుంచి 25 శాతం మండల పరిషత్తులకు, 5 నుంచి 15 శాతం జిల్లా పరిషత్తులకు ఇవ్వాలని ప్రతిపాదించింది.
స్థానిక సంస్థల బేసిక్ నిధులను జీత,భత్యాలు మినహా స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చు. టైడ్ నిధులను పారిశుద్ధ్య, బహిరంగ మలవిసర్జన లేకుండా చేయడం తదితరాలకు వినియోగించుకోవాలని ఆర్థిక సంఘం సూచించింది.
ఇవీ చూడండి: అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!