Teachers Transfers in Telangana: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీల వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలను ఇవాళ ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుండగా.. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హార్డ్‌కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు దరఖాస్తులకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు ఆమోదం తెలియజేస్తారు.
Teachers promotions in Telanganaఈ బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఫిబ్రవరి 7న డీఈవో, ఆర్జేడీ వెబ్‌సైట్లలో సీనియారిటీ జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు సీనియారిటీ జాబితాపై మూడ్రోజులు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించనున్నారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఫిబ్రవరి 13న మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునః పరిశీలన చేపడతారు. ఫిబ్రవరి 14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులను విడుదల చేస్తారు.
Teachers Transfers Schedule in Telangana: ఫిబ్రవరి 15న ప్రధానోపాధ్యాయుల బదిలీల అనంతరం మిగిలిన ఖాళీలను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల హెచ్ఎంల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల ప్రకటన, బదిలీ ఆప్షన్స్ నమోదు ఉంటుంది. ఫిబ్రవరి 21న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం కల్పించి.. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీకి డీఈవోలు ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీలు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 25 నుంచి 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పిస్తారు. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీలు ప్రకటించి, వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారు. మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునః పరిశీలనకు అవకాశం కల్పించి.. మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. మార్చి 5 నుంచి 19 వరకు డీఈవో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపాలి. దరఖాస్తు అందిన 15 రోజుల్లో సంబంధిత అధికారులు వాటిని పరిష్కరిస్తారు.
వారికి మొదటి ప్రాధాన్యం..: ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీల కోసం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నెంబర్ 5 జారీ చేశారు. కనీసం రెండేళ్ల పాటు ప్రస్తుత పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులే బదిలీలకు అర్హులుగా స్పష్టం చేసింది. ఐదేళ్లు పూర్తైన ప్రధానోపాధ్యాయులను, మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లను.. దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్లు జీవోలో వెల్లడించారు. మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న టీచర్లను వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. బాలికల పాఠశాలల్లో 50 ఏళ్ల లోపు పురుష ఉపాధ్యాయులుంటే బదిలీ చేసి.. మహిళను నియమిస్తారు. ఒకవేళ మహిళా ఉపాధ్యాయులు లేకపోతే.. 50 ఏళ్లు దాటిన పురుషులను నియమిస్తారు. ఉపాధ్యాయులకు డీఈవో.. ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఎముకల క్షయ, కిడ్నీ, కాలేయ, గుండె మార్పిడి, డయాలసిస్ బాధితులకు ఇందులో ప్రాధాన్యమివ్వనున్నారు.
పైరవీలతో ఉత్తర్వులు..: ఈ బదిలీల ప్రక్రియ వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా జరుగుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ చెబుతున్నప్పటికీ.. పైరవీలతో దొడ్డిదారిన ఉత్తర్వులు వస్తున్నాయన్న ఆరోపణలు మొదలయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్, ఇతర పట్టణ ప్రాంతాలకు వెబ్ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా రాజకీయ పలుకుబడితో బదిలీ ఉత్తర్వులు ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి.
ఇవీ చూడండి..
ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రూ.20కే వైద్యం.. పేదలకు దశాబ్దాలుగా సేవ.. ఆదర్శ డాక్టరుకు పద్మశ్రీ