శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ వెల్లడించారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని... ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రమణ విమర్శించారు. కొవిడ్ విజృంభణతో సామాన్య ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికలపై సమీక్షలు నిర్వహస్తున్నారని మండిపడ్డారు. కులవృత్తులు, చేతి వృత్తులు నిర్వీర్యమై లక్షలాది కుటుంబాలకు ఉపాధిలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని కేసీఆర్ రూ.15 వేల కోట్లకు పైగా బాండ్స్‌ను అమ్ముకున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి దక్షణ తెలంగాణ ప్రాంతాన్ని ఏడారిగా మార్చే కుట్రలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని రమణ ఆక్షేపించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతున్న ఇళ్లు, భూమిలేని పేదలకు భూపంపిణీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని రమణ ఆగ్రహించారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్