వినాయక చతుర్థి వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వినాయక విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి.. కార్యకర్తలు, అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్క మతాన్ని, మత విశ్వాసాలను గౌరవించాలని.. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వాలు సైతం అందుకు అనుగుణంగా ప్రవర్తించినప్పుడే శాంతి, సౌభాగ్యం సాధ్యమని చెప్పారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు వారందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారన్నారు. గణేశ్ వేడుకలు, నిమజ్జనం సందర్భంగా పటిష్ఠ ఏర్పాట్లతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నామని.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఏ పాలకులూ ప్రవర్తించలేదన్నారు. మత విశ్వాసాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రవర్తించాలని.. అప్పుడే శాంతి, సౌభాగ్యం సాధ్యమన్నారు.
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కులాలకు, మతాలకు అన్నింటికీ అతీతంగా పూజలందుకునే ఏకైక దేవుడు వినాయకుడు. వేరే మతస్థులు కూడా వినాయకుడి పూజలు చేస్తారు. మతాలపైన విశ్వాసం ఉన్న వారి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఒక్క వినాయకుడి విషయంలోనే కాకుండా హిందువులు గాని, ముస్లింలు గాని, వివిధ మతస్థులంతా ఐకమత్యంగా ఉండాలంటే ప్రతిఒక్క మతాన్ని గౌరవించాలి. అది చేసినప్పుడే సమాజంలో శాంతి, సౌభాగ్యం ఉంటుంది. మతం విషయంలో గవర్నమెంట్ జోక్యం చేసుకోకూడదు. ఇది ప్రాథమిక హక్కు. లేకపోతే వినాయకుని విగ్రహాలే అమ్మకూడదని ఆంక్షలు పెట్టే పరిస్థితి కొచ్చారు. ఇది మంచిది కాదు. -చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ అధ్యక్షుడు
ఇదీ చూడండి: Khairtabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ