ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఎంతవరకైనా పోరాడతామని తెదేపా అధినేత చంద్రబాబు.. వైకాపా నేతలను హెచ్చరించారు. మాచర్లకు తెలుగుదేశం నేతలు వెళ్లాలంటే.. పాస్ పోర్టు, వీసాలు కావాలా.. అని ప్రశ్నించారు. మాచర్ల ఏమైనా పాకిస్థానా.. అని నిలదీశారు. రౌడీయిజం చేస్తే.. అదే వైకాపా నేతలకు చివరి రోజు అవుతుందని గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా సంక్షేమం అమలు చేస్తే.. దాడులు చేసి, భయపెట్టి ఏకగ్రీవంగా ఎన్నికవడం కాదని.. నామినేషన్ వేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు
నామినేషన్ల సందర్భంగా.. రాష్ట్రంలో వైకాపా నాయకులు చేసిన దాడులపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశారు. సత్వరమే.. ఈ విషయంలో స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
"అలా మాట్లాడేందుకు బుద్ధి లేదా?"
వైకాపా తీరుపై మండిపడ్డ చంద్రబాబు.. ఏ జిల్లా నాయకులు ఆ జిల్లాలోనే ఉండాలని చెప్పేందుకు బుద్ధి లేదా.. అని ప్రభుత్వాన్ని, వైకాపా నేతలను ప్రశ్నించారు. పనికి రాని చెత్త వాదనలు చేయవద్దన్నారు. ఎవరిని బెదిరిస్తున్నారని నిలదీశారు. కృష్ణా జిల్లా నేతలు గుంటూరు జిల్లాకు వెళ్లొద్దంటే.. జగన్ కూడా పులివెందులకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి నేతలు.. ప్రతి జిల్లాలో తిరుగుతారని.. వారిని అడ్డుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలని కోరారు.
"జిల్లాకో నిజ నిర్ధరణ కమిటీ వేస్తాం"
ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన ప్రతి ప్రాంతానికి సంబంధించి పూర్తి వివరాలను ప్రజలముందు పెడతామని చంద్రబాబు చెప్పారు. ప్రతి జిల్లాకు నిజ నిర్ధరణ కమిటీ వేస్తామన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేస్తామని స్పష్టం చేశారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. జగన్‌ను మించిన వాళ్లను చాలా మందిని చూశానని చెప్పారు. దౌర్జన్యం చేస్తే.. ప్రజల కోసం ఎంతటివరకైనా పోరాటం చేస్తానన్నారు.