ఏపీలోని గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నరసింగపాడు రెండో వార్డులో గుర్తులు తారుమారు కావటం గందరగోళానికి గురి చేసింది. నరసింగపాడు పంచాయతీలోని రెండో వార్డులో వెంకటశివ, ఏడుకొండలు పోటీ చేశారు. శనివారం పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి బ్యాలెట్ పేపర్లపై గుర్తులు తారుమారయ్యాయని వారు ఆరోపించారు. ఎన్నికల అధికారులు వారికి కేటాయించిన గుర్తులు కాకుండా వేరే గుర్తుతో వారు ప్రచారం చేసినట్లు తేలింది.
వెంకటశివకు కుక్కర్, ఏడుకొండలుకు గౌను గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. వారు మాత్రం పోటీ అభ్యర్థి గుర్తుతో.. అనగా ఏడుకొండలు కుక్కర్ గుర్తుతో, వెంకట శివ గౌనుతో ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. పోలింగ్ సమయానికి విషయం తెలిసి అభ్యర్థులిద్దరూ..కంగుతిన్నారు. పోలింగ్ వాయిదా వేయాలని కోరినా..అధికారులు అంగీకరించలేదు. తమకు కేటాయించిన గుర్తుల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. చేసేదేం లేక... ఓట్లు వేసేందుకు వచ్చిన తమ మద్దతుదారులతో తమ అసలు గుర్తు చెప్పి ఓట్లు వేయాలని అభ్యర్థులు సూచించారు. పోలింగ్ పూర్తై ఓట్ల లెక్కింపులో వెంకట శివ 14 ఓట్లతో గెలుపొందారు. గుర్తులు మారటం ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపిందని ఓడిన అభ్యర్థి ఏడుకొండలు వాపోయారు.
ఇదీ చూడండి: పోరాట యోధుడిగా, పాలకుడిగా.. కేసీఆర్ 'ఒక్కగానొక్కడు'