హేతుబద్ధీకరణ వల్ల ఎక్కువ మంది విద్యార్థులున్న చోటకు బదిలీ చేసిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా కనీసం 6 వేల ఉపాధ్యాయ పోస్టులు మిగిలే అవకాశం ఉందని విద్యాశాఖ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఆ పోస్టులను డీఈవోల వద్ద(పూల్) ఉంచుతారు. భవిష్యత్తులో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే వాటిని భర్తీ చేస్తారు. కొత్త జిల్లాల వారీగా హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో దాదాపు 1.08 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
27 మంది ఉంటే హెచ్‌ఎం పోస్టు!
రాష్ట్రంలో దాదాపు 18 వేల ప్రాథమిక పాఠశాలలుండగా.. 4,400కుపైగా బడుల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులున్నాయి. మొత్తం 10 వేల ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గత మార్చిలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. అంటే ఇంకా 5,600 పోస్టులు అవసరం. అయిదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మంజూరు చేయలేదు. పాఠశాలలో 150 మందికి మించి విద్యార్థులుంటేనే హెచ్‌ఎం పోస్టు ఇస్తామని తాజాగా హేతుబద్ధీకరణ జీవోలో పేర్కొన్నారు. ఇప్పుడున్న 4,400 మంది ప్రధానోపాధ్యాయుల్లో కొందరు 40-50 మంది విద్యార్థులు ఉన్నచోట కూడా పనిచేస్తున్నారు. కొత్తగా 5,600 పోస్టులు మంజూరు చేస్తే 27 మంది పిల్లలున్న చోట కూడా నియమించాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేశాయి. వాటిని సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్‌జీటీలకు) పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. అది స్కూల్ అసిస్టెంట్‌తో సమాన హోదా ఉండే పోస్టు.
వివిధ అంశాలు.. ప్రభావం...
- ఒకే ప్రాంగణంలోని బడుల విలీనం: దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 50-100 చోట్ల విలీనం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
- ఆంగ్ల మాధ్యమంలో 50 మందిలోపు ఉంటే రద్దు: ప్రస్తుతం దాదాపు 2,800 ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం సెక్షన్లు నడుస్తున్నాయి. వాటిలో కనీసం 200 చోట్ల రద్దు కావొచ్చని అంచనా. కొన్నిచోట్ల 6వ తరగతిలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభం కాగా.. ప్రస్తుతం 8వ తరగతి కొనసాగుతోంది. అక్కడి విద్యార్థులు మరో బడికి వెళ్లాల్సి ఉంటుంది.
- ప్రతి బడికి కనీసం ఒక ఉపాధ్యాయుడు: ఒక్క విద్యార్థి లేకున్నా ఉపాధ్యాయ పోస్టు ఉంటుంది. దాన్ని తర్వాత అదే మండలంలోని మరో బడిలో డిప్యుడేషన్‌పై సర్దుబాటు చేస్తారు.
- కొత్త జిల్లాల వారీగా హేతుబద్ధీకరణ: కొన్ని జిల్లాల్లో కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు ఉండవు. 2018లోనే వరంగల్ అర్బన్ (ప్రస్తుతం హనుమకొండ) జిల్లాకు ఉపాధ్యాయులు బదిలీపై వచ్చారు. అలాంటిచోట్ల కొత్త కొలువులు ఇప్పట్లో రావు.
ఇదీ చూడండి: School Rationalization: టీచర్ పోస్టుల హేతుబద్ధీకరణ, బడుల విలీనానికి సర్కారు కసరత్తు