హైదరాబాద్‌లో విలువైన హఫీజ్‌పేట భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. హఫీజ్ పేటలోని సర్వే నంబర్ 78లోని 8 ఎకరాల భూములపై క్రాఫ్ట్ ఎల్లాయ్ సంస్థకు హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వే నంబర్ 80లోని సినీ నిర్మాత సి.కల్యాణ్ కొనుగోలు చేసిన భూమిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జీహెచ్ఎంసీ సుప్రీంలో సవాల్ చేసింది.
ఈ పిటిషన్లపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్‌షా ధర్మాసనం విచారించింది. తెలంగాణ పట్టాదారు పాసుపుస్తకం చట్టం, జాగీర్దారు రద్దు చట్టం ప్రకారం హఫీజ్‌పేట భూములను ఎవరికీ బదిలీ చేయకూడదని.. ఆ భూములపై తెలంగాణ ప్రభుత్వానికే హక్కు ఉందని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదించారు. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని క్రాఫ్ట్ ఎల్లాయ్ సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని.. దానిపై ప్రభుత్వం మూడు వారాల్లో రీజాయిండర్ దాఖలు చేయాలని గడువు ఇచ్చింది. సినీ నిర్మాత సి.కల్యాణ్ కొనుగోలు చేసిన భూమి అంశంలో కల్యాణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం పదిసార్లు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కోర్టు వాటిని కొట్టివేసినట్లు చెప్పారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఇటీవలే దీనికి సంబంధించిన పిటిషన్‌ను కొట్టివేశారని రోహత్గీ... కోర్టు దృష్టికి తీసుకురాగా.. దాన్ని పరిశీలించాకా ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి : మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్